Rishabh Pant: మేం చేసింది తప్పే.. నో బాల్ వ్యవహారంపై పంత్ స్పందన

Pant Explanation On No Ball Issue

  • అంపైర్ల స్పందనే ఆగ్రహం తెప్పించిందన్న పంత్ 
  • అన్యాయం జరగడం వల్లే ఆమ్రే మైదానంలోకి వెళ్లాడని వెల్లడి 
  • క్షణికావేశంలో జరిగిందని కామెంట్
  • అంపైర్ ది సరైన నిర్ణయమన్న శాంసన్

పెను దుమారం రేపిన నో బాల్ వివాదంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. తాము చేసింది తప్పేనని ఒప్పుకొన్నాడు. చివరి ఓవర్ మూడో బంతి నడుము ఎత్తులో వచ్చినా నో బాల్ ఇవ్వకపోవడంపై మండిపడిన పంత్, ప్రవీణ్ ఆమ్రేలు మైదానంలోకి వెళ్లి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల వారి నుంచి ఆగ్రహం పెల్లుబుకడంతో పంత్ వివరణ ఇచ్చాడు. 

అంపైర్ల తీరు చాలా నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. బంతి నో బాల్ అని స్పష్టంగా తేలిందని, అయినా, నో బాల్ పట్ల అంపైర్లు సరిగ్గా స్పందించకపోవడమే తమకు ఆగ్రహం తెప్పించిందని అన్నాడు. కనీసం థర్డ్ అంపైరైనా కలగజేసుకుని నో బాల్ ఇవ్వాల్సిందని పేర్కొన్నాడు. తామొక్కళ్లమే నిబంధనలను మార్చలేం కదా అని ప్రశ్నించాడు. 

ఆమ్రేను మైదానంలోకి పంపడం కచ్చితంగా కరెక్ట్ పని కాదన్నాడు. అయితే, తమకు అన్యాయం జరిగిందని, క్షణికావేశంలోనే అతడు మైదానంలోకి వెళ్లాడని అన్నాడు. దాని గురించి ఇప్పుడు చేయాల్సిందేం లేదని చెప్పాడు. 

మరోవైపు బంతి ఫుల్ టాస్ పడడంతో సిక్సర్ వెళ్లిందని, అంపైర్ కరెక్ట్ నిర్ణయమే తీసుకుని దానికి కట్టుబడి ఉన్నాడని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.

  • Loading...

More Telugu News