Pawan Kalyan: సొంతవాళ్లు ఉండగా నేనెందుకు దత్తత వెళతాను?: పవన్ కల్యాణ్
- చింతలపూడిలో కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం
- వైసీపీ అంటే తనకేమీ ద్వేషం లేదన్న పవన్
- హామీలను అమలు చేయకపోతే మాత్రం తప్పనిసరిగా నిలదీస్తానని వ్యాఖ్య
- చంచల్ గూడ జైల్లో షటిల్ ఆడుకున్న వాళ్లా నాకు చెప్పేది? అంటూ సెటైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో అధికార పార్టీ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా ఘాటు విమర్శలు చేశారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా చింతలపూడిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని పవన్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్... వైసీపీపై విమర్శలు సంధించారు.
వైసీపీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, అయితే వైసీపీ నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మాత్రం తప్పనిసరిగా నిలదీస్తామని పవన్ తెలిపారు. తనను పదే పదే దత్తపుత్రుడు అంటూ ఆరోపణలు గుప్పిస్తున్న ఏపీ సీఎంపై పవన్ విరుచుకుపడ్డారు. తనను మరోమారు దత్తపుత్రుడు అని అంటే సీబీఐ దత్తపుత్రుడు అని మిమ్మల్ని అనాల్సి వస్తుందని పవన్ అన్నారు. తనకు సొంత వాళ్లు ఉన్నప్పుడు తాను ఎవరి వద్దకో దత్తత వెళ్లాల్సిన అవసరం లేదని పవన్ అన్నారు. అయినా చంచల్ గూడ జైల్లో షటిల్ ఆడుకున్న వాళ్లా నాకు చెప్పేది? అంటూ జగన్ పేరును ప్రస్తావించకుండానే పవన్ ఆరోపణలు గుప్పించారు.