Navneet Kour Rana: మహారాష్ట్ర సీఎంపై పోలీసులకు నవనీత్ కౌర్ దంపతుల ఫిర్యాదు
- హనుమాన్ చాలీసా వివాదంతో ముంబైలో హైటెన్షన్
- ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ దంపతుల అరెస్ట్
- సీఎం థాకరే సహా 700 మంది శివసేన కార్యకర్తలపై నవనీత్ కౌర్ ఫిర్యాదు
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కంప్లైంట్
హనుమాన్ చాలీసా వివాదం మహారాష్ట్ర రాజధాని ముంబైలో హైటెన్షన్ వాతావరణానికి దారి తీసిన సంగతి తెలిసిందే. హనుమాన్ జయంతి నాడు సీఎం ఉద్ధవ్ థాకరే నివాసం ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు చేసిన ప్రకటనకు నిరసనగా శివసేన శ్రేణులు ఎంపీ ఇంటిని ముట్టడించే యత్నం చేశారు. ఈ క్రమంలో నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఖార్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నవనీత్ కౌర్ దంపతులు కీలక పరిణామానికి తెర తీశారు. తమ ఇంటి ముట్టడికి యత్నించిన శివసేనపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో శివసేన చీఫ్గా ఉన్న సీఎం ఉద్ధవ్ థాకరే, ఆ పార్టీకి చెందిన అనిల్ పరబ్, సంజయ్ రౌత్ సహా శివసేనకు చెందిన 700 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని వారు పోలీసులను కోరారు. వారందరిపై ఐపీసీ 120బీ, 143, 147, 148, 149, 452, 307, 153ఏ, 294, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు.