Chiranjeevi: ఇక ప్రాంతీయ సినిమాల్లేవు... అన్నీ ఇండియన్ సినిమాలే: చిరంజీవి

Chiranjeevi speech in Acharya pre release event

  • హైదరాబాదులో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్
  • భారీగా తరలివచ్చిన మెగా ఫ్యాన్స్
  • వేడుకకు హాజరైన రాజమౌళి తదితరులు
  • రాజమౌళిని ఘనంగా సన్మానించిన మెగాస్టార్ 

ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రసంగించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ను నటింపజేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో చేస్తుండడంతో రాజమౌళిని ఒప్పించేందుకు సురేఖ ద్వారా లేడీస్ సెంటిమెంట్ ప్రయోగించామని చెప్పారు. తామిద్దరినీ ఒకే సినిమాలో చూడాలన్నది సురేఖ కల అని చెప్పామని, దాంతో రాజమౌళి ఒప్పుకున్నారని చిరంజీవి వెల్లడించారు. 

అంతేకాకుండా, రాజమౌళి గొప్పదనాన్ని కూడా చిరంజీవి వేనోళ్ల కొనియాడారు. "రుద్రవీణ సమయంలో జాతీయ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాను. తేనీటి విందు సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అన్నీ హిందీ సినిమాల గురించే చూపించారు. రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ వాళ్ల ఫొటోలే ఎక్కువగా ఉన్నాయక్కడ. దక్షిణాది గురించి చూపించాల్సి వచ్చేసరికి అక్కడ ఎంజీఆర్-జయలలిత ఫొటో ఒకటి, మలయాళ నటుడు ప్రేమ్ నజీర్ ఫొటో మాత్రమే కనిపించాయి. నాకు చాలా బాధగా అనిపించింది. తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో ఆదరణ లేదనిపించింది.

కానీ ఇన్నాళ్ల తర్వాత తెలుగు సినిమా ఖ్యాతిని రొమ్ము విరుచుకుని మరీ చెప్పుకోగలిగేలా రాజమౌళి చాటారు. తెలుగు సినిమాను సమున్నత ఎత్తులకు తీసుకెళ్లి మన పరిశ్రమ గర్వంగా తలెత్తుకునేలా చేశారు" అని వివరించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఓ శాలువా తెప్పించి రాజమౌళిని వేదికపైనే చిరంజీవి సన్మానించారు. ఇకపై ప్రాంతీయ సినిమాలు ఉండవని, రాజమౌళి వేసిన బాటలో అన్నీ ఇండియన్ సినిమాలే అని చిరంజీవి స్పష్టం చేశారు. ఇప్పుడు యశ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరూ పాన్ ఇండియా స్టార్లు అని వెల్లడించారు. 

ఆచార్యలో రామ్ చరణ్ సరసన నటించిన పూజా హెగ్డే గురించి చెబుతూ... పూజా నవ్వుకు తన భార్య సురేఖ పెద్ద ఫ్యాన్ అని వెల్లడించారు. నీ పక్కన హీరోగా చేస్తే ఇంకా బాగుండేదని పూజాతో చిరు చమత్కరించారు. ఇక ఆచార్య సినిమా గురించి చెబుతూ, ప్రేక్షకులను అలరించే అనేక అంశాలు ఉన్న చిత్రం ఇదని, అందరూ ఆస్వాదించేలా చిత్రం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 29న కలుసుకుందాం అంటూ ప్రసంగం ముగించారు.


చిరంజీవితో పోల్చితే మేమెంత...: రాజమౌళి

అనేక విజయాలు సాధించిన మీరు ఇంత అణుకువగా ఎలా ఉంటారు అని నన్నడుగుతుంటారు. చిరంజీవి అంతటి వ్యక్తి ఎంతో సాధించి కూడా ఇప్పటికీ ఒదిగి ఉంటారు. ఆయనే ఎంతో ఒద్దికగా ఉన్నప్పుడు మేమెంత సాధారణంగా ఉండాలో అర్థమవుతుంది. ఇక, రామ్ చరణ్ గురించి మూడ్నెల్లుగా మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడో విషయం చెబుతాను. మగధీర సమయంలో రామ్ చరణ్ వెంట ప్రతి అంశంలోనూ చిరంజీవి ఉంటాడని భావించాను. కానీ, నాకు తెలిసింది ఏమిటంటే... ఏ అంశంలోనూ చిరంజీవి జోక్యం చేసుకోరు. తనకు సంబంధించిన ప్రతి నిర్ణయం రామ్ చరణే తీసుకుంటారు. తన విషయాలన్నింటికి రామ్ చరణే బాధ్యుడు. ఇక చిరంజీవి స్క్రీన్ పై డామినేట్ చేసే విధానం బాగా నచ్చుతుంది కానీ, తెరపై చిరంజీవి కంటే మా హీరో (రామ్ చరణ్)నే బాగుంటారు. 

చిరంజీవి డైరెక్ట్ చేసే వరకు రావడం సంతోషదాయకం: కొరటాల

చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగామని చెప్పి చిరంజీవి గారి వయసు పెంచేసి, మా వయసు తగ్గించుకోలేం. కానీ, ఆయన సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడి తన్నులు తిన్నాం. ఆయన సినిమా చూస్తే చాలని, ఆయన సినిమా షూటింగ్ చూస్తే చాలనే స్థాయి నుంచి ఆయనకు యాక్షన్, కట్ చెప్పేంత వరకు రావడం ఎంతో సంతోషం కలిగిస్తుంది. 

మా నాన్నతో ఎంతో దగ్గరగా ఉండే అవకాశం ఆచార్యతో వచ్చింది: రామ్ చరణ్

ఆచార్య చిత్రంలో ప్రతి అంశాన్ని ఎంజాయ్ చేశాను. నాకెంతో మధురమైన అనుభూతులు అందించిన ఆచార్య యూనిట్ కు కృతజ్ఞతలు చెబుతున్నాను. కొరటాల శివ గారూ... ఇన్ని సంవత్సరాలు మా నాన్న గారిని చూసి నేర్చుకున్న దానికంటే, మారేడుమిల్లిలో 20 రోజులు ఆయన్ను దగ్గర్నుంచి చూసి నేర్చుకున్నదే ఎక్కువ. 

ఇక రాజమౌళి గురించి చెప్పాలి. బొమ్మరిల్లు సినిమాలో... హీరో తన చేయి ఇంకా తండ్రి చేతుల్లోనే ఉందని చెబుతారు. రాజమౌళి కూడా అంతే. తన సినిమాలో ఎవరైనా ఒక యాక్టర్ నటిస్తుంటే ఆ సినిమా పూర్తయ్యేవరకు ఆ నటుడి చేయి రాజమౌళి చేతిలోనే ఉంటుంది. 

అలాంటి రాజమౌళి తొలిసారిగా చిరంజీవి గారి వల్ల కావొచ్చు, లేకపోతే మా అమ్మ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలుసుకుని కావొచ్చు... ఆర్ఆర్ఆర్ సెట్స్ మీద నుంచి నా చేయిని వదిలి ఆచార్య సెట్స్ మీదకు పంపించారు. మిర్చి నుంచి శివ గారి దర్శకత్వంలో చేద్దామనుకుంటే ఇన్నాళ్లకు కుదిరింది. అది కూడా మా నాన్న గారితో శివ గారి దర్శకత్వంలో చేయాలని రాసిపెట్టి ఉందేమో... ఇన్నాళ్లు ఆలస్యం అయిందనుకుంటాను. 

వేదికపైకి దూసుకొచ్చిన అభిమాని

ఓ అభిమాని హఠాత్తుగా వేదిక మీదుకు దూసుకురావడంతో రామ్ చరణ్ ప్రసంగం ఆపారు. ఆ అభిమాని రామ్ చరణ్ కు పాదాభివందనం చేశాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది రావడంతో చరణ్ వాళ్లను వారించాడు. అంతేకాదు, ఆ అభిమానితో సెల్ఫీ దిగి సంతోషం కలిగించాడు.
.

  • Loading...

More Telugu News