MS Dhoni: బ్లాక్ చికెన్ వ్యాపారంలోకి ధోనీ... 2 వేల కోడిపిల్లలకు ఆర్డర్

Dhoni orders for two thousand Kadaknath chicks

  • పోషక విలువలు పుష్కలంగా ఉండే కడక్ నాథ్ కోళ్లు
  • మాంసంతో సహా నల్లగా ఉండే కోడి
  • దేశంలో కడక్ నాథ్ కోళ్లపై పెరుగుతున్న ఆసక్తి
  • ఓ వాహనంలో ధోనీ వ్యవసాయ క్షేత్రానికి కోడిపిల్లలు

దేశంలో ఇటీవల బ్లాక్ చికెన్ (కడక్ నాథ్ కోళ్లు) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పేరుకు తగ్గట్టే దేహంపై ఈకలు, లోపలి మాంసం, గుడ్లతో సహా మొత్తం నల్లగా ఉండే ఈ కోడి అనేకమంది ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఆకర్షిస్తోంది. కడక్ నాథ్ కోడి మాంసంలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. దాంతో ఈ తరహా కోళ్లను పరిశ్రమ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు. వారిలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కూడా ఉన్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాక ధోనీ కేవలం ఐపీఎల్ లోనే ఆడుతున్నాడు. సంవత్సరానికి రెండు నెలలు మాత్రమే క్రికెట్ ఆడే ధోనీ మిగతా సమయం అంతా వ్యవసాయానికి, ఇతర వ్యాపార కార్యకలాపాల కోసమే కేటాయిస్తున్నాడు. ఇటీవల కడక్ నాథ్ కోళ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ధోనీ, కొత్తగా 2 వేల కోడిపిల్లలకు ఆర్డర్ చేశారు. 

మధ్యప్రదేశ్ లోని జబువాలో ఓ కోఆపరేటివ్ సొసైటీ ఈ కడక్ నాథ్ కోళ్ల ఉత్పత్తి, పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా పలువురు కోడిపిల్లలు కొనుగోలు చేస్తున్నారు. ధోనీ కూడా ఈ సహకార సమాఖ్యకే ఆర్డర్ చేశాడు. ధోనీ కడక్ నాథ్ కోడిపిల్లలు కొనుగోలు చేసిన విషయాన్ని ఇక్కడి జిల్లా కలెక్టర్ నిర్ధారించారు. ఓ వాహనంలో రెండు వేల కోడిపిల్లలను రాంచీలోని ధోనీ వ్యవసాయ క్షేత్రానికి తరలించినట్టు వెల్లడించారు. ఎవరైనా ఈ కోడిపిల్లల కోసం ఆర్డర్ చేయవచ్చని, ధోనీ వంటి వ్యక్తి పోషక విలువలు పుష్కలంగా ఉండే కడక్ నాథ్ కోళ్లపై ఆసక్తి చూపించడం హర్షణీయం అని పేర్కొన్నారు. 

కాగా, ప్రస్తుతం మార్కెట్లో లభించే మామూలు కోడి మాంసంతో పోలిస్తే కడక్ నాథ్ కోడిమాంసం ధర ఎక్కువేనని తెలుస్తోంది.
.

  • Loading...

More Telugu News