Kalvakuntla Kavitha: విశ్వసనీయత అంటే అదే!: ఎమ్మెల్సీ కవిత
- హైదరాబాదులో మహిళా జర్నలిస్టులకు వర్క్ షాప్
- ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవిత
- 2001లో కేసీఆర్ జై తెలంగాణ అన్నారని వెల్లడి
- ఆయనను ఎవరూ నమ్మలేదన్న కవిత
- తెలంగాణ వచ్చేవరకు జై తెలంగాణ అంటూనే ఉన్నారని వివరణ
తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా పాత్రికేయులకు రెండ్రోజుల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగింది. ముగింపు కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె విశ్వసనీయత అనే అంశంపై ప్రసంగించారు.
జర్నలిస్టులకు, పాత్రికేయ రంగానికి విశ్వసనీయత ముఖ్యమని అన్నారు. తన తండ్రి కేసీఆర్ 2001లో జై తెలంగాణ నినాదం చేసినప్పుడు ఆయనను ఎవరూ విశ్వసించలేదని తెలిపారు. కానీ తెలంగాణ సాకారమయ్యేంత వరకు ఆయన జై తెలంగాణ అంటూనే ఉన్నారని, విశ్వసనీయత అంటే అదేనని వివరించారు.
జర్నలిస్టులు కూడా విశ్వసనీయతకు కట్టుబడి వార్తలు రాసినప్పుడే సమాజంలో గుర్తింపు పొందుతారని కవిత పేర్కొన్నారు. సంచలనం కోసం వార్తలు రాసేవాళ్ల ప్రభావం తాత్కాలికేమనని అభిప్రాయపడ్డారు. కాగా, మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అంటారని, అలాంటి రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం హర్షణీయమని కవిత వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళా పాత్రికేయులను ఇలా ఒకచోటికి చేర్చి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు.