Rajiv Kumar: సీఎం జగన్ ను ప్రశంసించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్

 Niti Aayog Vice Chairman appreciates CM Jagan

  • ప్రకృతి వ్యవసాయంపై జాతీయ సదస్సు
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సీఎం జగన్
  • నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సదస్సు
  • ఏపీ విధానాలు అద్భుతమన్న రాజీవ్ 

దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో నీతి ఆయోగ్ జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం తీరుతెన్నులపై ప్రజంటేషన్ ఇచ్చారు. 

ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సీఎం జగన్ ను ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను ఏపీ ఆచరణలో పెట్టిందని, ఈ దిశగా అద్భుతమైన చర్యలు తీసుకున్నారని రాజీవ్ కుమార్ కొనియాడారు. ఏపీలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే)ను ప్రత్యక్షంగా పరిశీలించానని, రైతులకు ఆర్బీకేలు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. 

అంతకుముందు సీఎం జగన్, ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని భారీ స్థాయిలో చేపట్టేందుకు జర్మనీ 20 మిలియన్ యూరోల సాయం చేస్తోందని తెలిపారు. జర్మనీ నిధులతో ఇండో-జర్మన్ గ్లోబల్ అకాడమీ ఆన్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (ఐజీజీఏఏఆర్ఎల్) ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వ్యవసాయానికి సర్టిఫికేషన్ వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు అందుబాటులో ఉండేలా చూడడమే తమకు ప్రాధాన్యతా అంశమని సీఎం జగన్ సదస్సులో స్పష్టం చేశారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే...

  • యూనివర్సిటీ కోర్సుల్లో ప్రత్యేక పాఠ్యాంశంగా ప్రకృతి వ్యవసాయం. 
  • కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో 90 శాతం నిధులను కేంద్రమే భరించాలి. 
  • ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలి. వారికి రివార్డులు ఇవ్వాలి. 
  • ప్రకృతి వ్యవసాయం చేసే రైతును దేశానికి గొప్ప సేవకుడిగా చూడాలి. 
  • అధిక విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫారసుల్లో వెయిటేజి ఇవ్వాలి.

  • Loading...

More Telugu News