Revanth Reddy: ఈడీ, సీబీఐ, డీఆర్ఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ.. ఫుడింగ్ పబ్ కేసులో రేవంత్ రెడ్డి పిటిషన్
- హైకోర్టులో పిల్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి
- కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని వినతి
- కేసులో ప్రముఖుల పిల్లలున్నారన్న టీ పీసీసీ చీఫ్
హైదరాబాద్‌లో కలకలం రేపిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు వ్యవహారంలో సోమవారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఆయన హైకోర్టును కోరారు.
పబ్‌పై పోలీసులు దాడులు చేసిన సమయంలో అక్కడ పలువురు ప్రముఖులకు చెందిన పిల్లలు ఉన్నారని రేవంత్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో అసలు వాస్తవాలు తెలియాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. ఈడీ, సీబీఐ, డీఆర్ఐ సంస్థలకు చెందిన అధికారులతో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. ఆ బృందంతో దర్యాప్తు చేయిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని రేవంత్ హైకోర్టుకు తెలిపారు.