Siddipet District: ఎస్సైగా నమ్మించి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న కిలాడీ.. అరదండాలు వేసిన పోలీసులు
- ప్రేమించిన వ్యక్తికి రూ. 13 లక్షలు ఇచ్చి మోసపోయిన నిందితురాలు
- అప్పులు తీర్చేందుకు ఎస్సైగా అవతారం
- పలువురి నుంచి లక్షల్లో వసూలు
- పదుల సంఖ్యలో బాధితులు
- ఎస్సైగా నమ్మించి వరంగల్ యువకుడితో వివాహం
నిరుద్యోగులే లక్ష్యంగా ఎస్సైగా ప్రచారం చేసుకుంటూ లక్షల్లో దోచుకుంటున్న కిలాడీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. సాంకేతికతను ఉపయోగించుకుని ఇన్నాళ్లూ తప్పించుకున్న నిందితురాలు ఎట్టకేలకు హుస్నాబాద్‌లో పట్టుబడింది.
పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటకు చెందిన ఓ యువకుడు పోలీసు ఉద్యోగానికి ఆశపడి ఎస్సైగా పరిచయమైన ఓ మహిళకు రూ. 10 లక్షలు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఆమె పత్తా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నాలుగు రోజుల క్రితం మాయ‘లేడీ’కి అరదండాలు వేశారు.
విచారణలో ఆమె వెల్లడించిన విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. సిద్దిపేట, ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఎంతోమంది యువకులను మోసం చేసినట్టు వెల్లడించింది.
నిందితురాలి పేరు విజయభారతి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామం. డిగ్రీ పూర్తి చేసి 2018లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నప్పటికీ ఎంపిక కాలేదు. మహబూబాబాద్‌కు చెందిన ఓ యువకుడిని ప్రేమించి మోసపోయింది. అప్పులు తెచ్చి మరీ అతడికి రూ. 13 లక్షలు ఇచ్చింది.
అతడి చేతిలో మోసపోయిన తర్వాత అప్పులు తీర్చేందుకు ఎస్సై అవతారం ఎత్తింది. ఎస్సై పరీక్షలకు సంబంధించి నకిలీ పత్రాలు, ధ్రువపత్రాలు తయారుచేసింది. అంతేకాదు, ఎస్సైగా ఎంపికైనట్టు నమ్మించి ప్రముఖుల నుంచి సన్మానాలు కూడా చేయించుకుంది. ఆ ఫొటోలను చూపించి పోలీసు శాఖలో, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసాలు చేయడం ప్రారంభించింది.
నారాయణరావుపేట యువకుడి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసిన విజయభారతి.. అతడి ద్వారా మల్లన్న సాగర్ ముంపు బాధితుల నుంచి బాండ్ పేపర్ రాయించుకుని లక్షలు తీసుకుంది. ఎస్సైగా నమ్మించి వరంగల్‌కు చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. వీరికిప్పుడు నాలుగు నెలల చిన్నారి ఉన్నాడు. ఆమె కోసం గాలించిన పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంది. టవర్ లొకేషన్ తెలియకుండా జాగ్రత్త పడింది. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని అతడి ద్వారా ఫోన్ చేయించారు. చివరికి హుస్నాబాద్‌లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికెళ్లి అదుపులోకి తీసుకున్నారు.