Anand Mahindra: మస్క్, చూశావా ఇది.. భారత్‌లోని అసలైన టెస్లా ఇదే!: ఆనంద్ మహీంద్రా ట్వీట్

Anand Mahindra Tags Elon Musk And Shows Original Tesla From India
  • ఎడ్లబండి ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • స్వయం చాలక టెస్లా వాహనమని కామెంట్
  • గూగుల్ మ్యాప్స్, పెట్రోలుతో పనిలేదన్న పారిశ్రామికవేత్త
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ముందువరుసలో ఉంటారు. స్ఫూర్తినింపే, ఆలోచింపజేసే, ప్రేరణ కలిగించే పోస్టులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అలాంటి పోస్టే ఒకటి షేర్ చేస్తూ టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. మస్క్ కంపెనీ టెస్లా డ్రైవర్‌తో పనిలేకుండానే దూసుకుపోయే కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ కార్లకు బోల్డంత సాంకేతిక పరిజ్ఞానం, గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ అవసరం.

అయితే, అలాంటివేవీ అవసరంలేని ‘ఒరిజనల్ టెస్లా వాహనం’ ఇదేనంటూ ఆనంద్ మహీంద్రా ఓ ఎద్దులబండి ఫొటోను పోస్టు చేశారు. దానిపై ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. బండిని నడిపే వాడు, వెనకనున్న ఇద్దరు కూడా కునుకు తీస్తుండగా, ఎద్దులు మాత్రం గమ్యం దిశగా దూసుకుపోతున్నాయి. ఈ ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. దీని ఫీచర్లను కూడా వివరించారు.

‘‘ఒరిజినల్ టెస్లా వెహికిల్ ఇదే. దీనికి గూగుల్ మ్యాప్స్‌తో పనిలేదు. ఇంధనం కొనాల్సిన పనిలేదు. పొల్యూషన్ అంతకంటే లేదు. ఇది పూర్తిగా స్వయం చాలక వాహనం’’ అని కామెంట్ తగిలించారు. దీనికి కావాల్సిందల్లా ఇల్లు, పనిచేసే ప్రదేశాన్ని సెట్ చేసుకోవడమే. ఆ తర్వాత ఎంచక్కా బండెక్కి ఓ కునుకు తీసినా గమ్యాన్ని చేరుకోవచ్చు అని రాసుకొచ్చారు. అంతేకాదు, ఈ ట్వీట్‌పై రియాక్షన్ కోరుతూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా సమయస్ఫూర్తికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఎడ్లబండితో తమకున్న అనుభవాలను పంచుకుంటున్నారు.
Anand Mahindra
Elon Musk
Tesla
India
Bullock cart

More Telugu News