Moeen Ali: సీఎస్కేకు వరుస ఎదురు దెబ్బలు.. మొయిన్ అలీకి గాయం
- శిక్షణ సందర్భంగా కాలి చీలమండ వద్ద గాయం
- గత రెండు మ్యాచులకు దూరం
- స్కానింగ్ ఫలితాల తర్వాతే స్పష్టత
చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గాయాల బెడద వీడడం లేదు. కీలకమైన ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికే దూరం కాగా, ఆ తర్వాత ఆడమ్ మిల్నే వంతు వచ్చింది. గాయంతో అతడూ దూరమయ్యాడు. తాజాగా స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ గాయంతో దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత రెండు మ్యాచుల్లో (ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తో జరిగిన) మొయిన్ అలీ పాల్గొనలేకపోయాడు. ఐపీఎల్ సీజన్ మధ్యకు వచ్చేసింది. లీగ్ దశలో 14 మ్యాచ్ లకు గాను సీఎస్కే ఇప్పటికే 8 ఆడేసింది. ఈ దశలో అలీ దూరం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసేదే. సీఎక్కే ఆటతీరు చూస్తుంటే లీగ్ దశ నుంచి నిష్క్రమించడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లీగ్ ముగిసే నాటికి మొయిన్ అలీ అందుబాటులోకి రాకపోవచ్చని తెలుస్తోంది.
గత శనివారం శిక్షణ సందర్భంగా కాలి చీలమండ గాయానికి మొయిన్ అలీ గురయ్యాడు. స్కానింగ్ ఫలితాలు చూసిన తర్వాత అతడి పరిస్థితిపై స్పష్టత రానుంది. నిజానికి ఈ సీజన్ లో మొయిన్ అలీ పెద్దగా రాణించింది లేదు. జట్టు ముందుగా అట్టి పెట్టుకున్న నలుగురు ఆటగాళ్లలో ఇతడు కూడా ఒకడు. అలీ కంటే సమర్థుడైన డూప్లెసిస్ ను వదులుకున్నందుకు సీఎస్కే మూల్యం చెల్లించుకుంటోంది.