loud speakers: యోగి ఆదేశాలతో యూపీలో సైలెంట్ అయిన లౌడ్ స్పీకర్లు
- వాల్యూమ్ ను తగ్గించేసిన మసీదులు, ఆలయాలు
- మధుర, గోరక్ నాథ్ ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి
- శబ్దం బయటకు రాకూడదంటూ కొత్త నిబంధనలు
ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు గత వారం తీసుకొచ్చిన నూతన ఆదేశాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రార్థనా స్థలాల వద్ద అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడుకోవడానికి కుదరదని సర్కారు తేల్చి చెప్పింది. అనుమతి తీసుకుని ప్రార్థనా స్థలాల్లో (మసీదులు, చర్చిలు, ఆలయాలు) లౌడ్ స్పీకర్లను వాడుకోవచ్చు. కానీ, వాటి నుంచి వెలువడే శబ్ద తరంగాల స్థాయి (సౌండ్) ఆ ప్రదేశం దాటి బయటకు వినిపించకూడదు. ఇది అక్కడి సర్కారు పెట్టిన కఠిన నిబంధన.
సర్కారు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్న 17,000 లౌడ్ స్పీకర్ల సౌండ్ తగ్గిపోయింది. 125 ప్రాంతాల్లోని లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకున్నట్టు శాంతి, భద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. నమాజ్ ప్రశాంత వాతావరణం మధ్య చేసుకునేందుకు వీలుగా భద్రతను కట్టుదిట్టం చేసినట్టు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థలం మధురలోనూ లౌడ్ స్పీకర్లు నిలిచిపోయాయి. ప్రతి రోజూ ఆలయం వద్ద గంటన్నర భక్తి గీతాలను పెట్టేవారు. అది ఇప్పుడు ఆగిపోయింది. గోరక్ నాథ్ టెంపుల్ లౌడ్ స్పీకర్ల వ్యాల్యూమ్ ను తగ్గించారు.