TRS: గులాబీ మయంగా భాగ్యనగరి.. జీహెచ్ఎంసీపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఫైర్
- ప్లీనరీ నేపథ్యంలో నగరమంతా గులాబీ జెండాలు
- టీఆర్ఎస్‌కు నిబంధనలు వర్తించవా అన్న ఎన్వీఎస్ఎస్
- రాత్రిలోగా తొలగించాలని జీహెచ్ఎంసీకి అల్టిమేటం
టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ ఆ పార్టీ జెండాలతో నిండిపోయింది. బుధవారం నాడు హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు భారీ ఎత్తున జెండాలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. ఫలితంగా నగరమంతా ఎక్కడ చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. ఈ తరహా పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇతర రాజకీయ పార్టీలు ఇలా నగరంలో జెండాలు, కటౌట్లు పెడితే జరిమానాలు విధిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు టీఆర్ఎస్ జెండాలపై ఎందుకు స్పందించరని ప్రభాకర్ మండిపడ్దారు. ఇతర పార్టీలకు వర్తించే ఆంక్షలు అధికార టీఆర్ఎస్‌కు వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా రాత్రిలోగా నగరంలో వెలసిన టీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించాలని ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు.