Pawan Kalyan: డ్యూటీలో ఉన్న డాక్టర్లు వైద్యం చేయాలా? లేక, అంబులెన్సులు పురమాయించాలా?: పవన్ కల్యాణ్
- రుయా ఘటన దయనీయమన్న పవన్ కల్యాణ్
- అందుకు ప్రభుత్వమే కారణమని ఆరోపణ
- వైద్యుడ్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుందని విమర్శ
తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కడప జిల్లా చిట్వేలుకు చెందిన నరసింహ కుమారుడు జసవ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ రుయా ఆసుపత్రిలో చనిపోయాడని అన్నారు. అయితే, తండ్రి నరసింహ తన బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి పడిన కష్టం, వేదన చూశానని తెలిపారు. ప్రైవేటు అంబులెన్స్ ఆపరేటర్లు అడిగినంత డబ్బు ఇవ్వలేక, చనిపోయిన తొమ్మిదేళ్ల కొడుకును భుజంపై వేసుకుని 90 కిలోమీటర్లు బైక్ మీద వెళ్లిన ఘటన కలచివేసిందని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి తాను ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని చెప్పారు.
ఈ ఘటనకు విధుల్లో ఉన్న ఓ వైద్యుడ్ని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని, డ్యూటీలో ఉన్న డాక్టర్లు వైద్యం చేయాలా? లేక అంబులెన్సులు పురమాయించాలా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగం పటిష్ఠం చేయకపోవడంవల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ఈ ఒక్క ఘటనే కాదని, రుయా ఆసుపత్రిలో కరోనా వేళ ఆక్సిజన్ కొరతతో 30 మంది మరణించారని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపరమైన మౌలిక సదుపాయాల కొరత గురించి నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సుధాకర్ మాట్లాడితే అతడిని వేధించారని పవన్ ఆరోపించారు. ఆ వేదనతోనే సదరు డాక్టర్ చనిపోయారని వెల్లడించారు. ఈ సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపిస్తున్నాయని విమర్శించారు.
కన్నవారి కడుపు కోత అర్థం చేసుకోలేని స్థితికి ఆసుపత్రుల చుట్టూ ఉండే మాఫియాలు తయారయ్యాయని పేర్కొన్నారు. వాటిపైనా, వాటిని పెంచి పోషిస్తున్న వారిపైనా కఠినచర్యలు తీసుకోవాలని జనసేనాని డిమాండ్ చేశారు.