Tamil Nadu: తంజావూరులో విషాదం: రథోత్సవంలో విద్యుదాఘాతం.. పదిమంది భక్తుల సజీవ దహనం
- తంజావూరులోని కలిమేడులో ఘటన
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అంటుకున్న మంటలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
తమిళనాడులోని తంజావూరులో గత రాత్రి జరిగిన ఆలయ ఉత్సవంలో విషాదం నెలకొంది. కలిమేడు ప్రాంతంలో జరిగిన ఉత్సవంలో విద్యుదాఘాతంతో 10 మంది సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తంజావూరు పక్కనున్న కలిమేడు ఎగువ ఆలయంలో ప్రతి ఏడాది ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వేడుకలో భాగంగా రథాన్ని లాగుతారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే రథోత్సవం తెల్లవారుజాము వరకు జరుగుతుంది. గత రాత్రి రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది.
ఈ క్రమంలో తంజావూరు-పుతలూరు రహదారి పక్కన రథం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుదాఘాతంతో మంటలు అంటుకోవడంతో 10 మంది భక్తులు సజీవ దహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.