Aung San Suu Kyi: మయన్మార్ ఉద్యమకారిణి అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు

Myanmar court sentences Aung San Suu Kyi to 5 years in jail for corruption

  • అవినీతి కేసులో దోషిగా తేల్చిన జుంటా కోర్టు
  • నగదు, బంగారం రూపంలో లంచం  తీసుకున్నట్టు ఆరోపణలు 
  • విచారణలో మరో 10 కేసులు
  • అవి కూడా ముగిస్తే గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు

మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి అక్కడి కోర్టు ఒకటి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అవినీతి కేసులో ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్లను నగదు, బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు జుంటా కోర్టు స్పష్టం చేసింది. 

అంగ్ సాన్ సూకీపై అక్కడి సైనిక ప్రభుత్వం మొత్తం 11 అవినీతి కేసులను మోపింది. వీటిలో అభియోగాలు నిరూపితం అయితే ఒక్కో దానిలో గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. ఈ 11 కేసుల్లో విచారణ పూర్తయిన మొదటి అవినీతి కేసు ఇది. నాలుగు గోడల మధ్యే కేసు విచారణ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇంతకుమించి వివరాలు బయటకు రాకుండా అక్కడి సైనిక సర్కారు జాగ్రత్తలు తీసుకుంది. 

నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ చైర్ పర్సన్ గా ఉన్న అంగ్ సాన్ సూకీ ప్రజానేత. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఆమె మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఇది అక్కడి పాలకులకు నచ్చదు. దీంతో ఆమెను మొదటి నుంచి సైనిక పాలకులు తొక్కిపెడుతూ వచ్చారు. 1990 ఎన్నికల్లో ఆమె పార్టీకి 81 శాతం పార్లమెంటు సీట్లు వచ్చాయి. అయినా ఆమెకు అధికారాన్ని బదలాయించేందుకు సైనిక పాలకులు నిరాకరించారు. ఎన్నికల ముందు నుంచే ఆమెను నిర్బంధించగా.. 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్ లోనే ఉండిపోయారు.

  • Loading...

More Telugu News