TRS: ఎన్టీఆర్, కేసీఆర్ లపై ప్రశంసలు కురిపించిన కేటీఆర్
- చరిత్రలో మరువలేని నేతలు ఇద్దరేనన్న కేటీఆర్
- ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేశారని కితాబు
- కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా క్రియేట్ చేశారని ప్రశంస
- దేశానికి తెలంగాణ తరహా అభివృద్ది కావాలన్న కేటీఆర్
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీ వేదికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావును స్మరించుకున్నారు. ఎన్టీఆర్తో కేసీఆర్ను పోలుస్తూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేశారని, ఇక తెలంగాణ ఉద్యమం, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా క్రియేట్ చేశారని వ్యాఖ్యానించారు.
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... " మరువలేని నేతలు ఇద్దరు మాత్రమే. ఒకరు ఎన్టీఆర్ అయితే... మరొకరు కేసీఆర్. ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేశారు. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా క్రియేట్ చేశారు. ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారు. కానీ మన దగ్గర రాష్ట్రాన్ని సాదించిన నేత సీఎంగా ఉన్నారు. కేసీఆర్ జన్మ ధన్యమైందని ప్రణబ్ ముఖర్జీనే అన్నారు. రైతు బంధు దేశానికే దిక్చూచీ అయ్యింది. దేశానికి తెలంగాణ తరహా అభివృద్ధి కావాలి. థ్యాంక్స్ టూ సీఎం కేసీఆర్" అంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.