YSRCP: సీఎంగా తన గ్రాఫ్ ఎలా ఉందో చెప్పిన జగన్
- తన పనితీరు గ్రాఫ్ 60 శాతమన్న సీఎం
- 40 శాతం గ్రాఫ్ పార్టీ నేతలదని వ్యాఖ్య
- ఎవరి గ్రాఫ్ బాగుంటే వారికే సీట్లన్న జగన్
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా తన పనీతిరు ఎలా ఉందన్న విషయంపై తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అదే సమయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ తమ గ్రాఫ్ లను పరిశీలించుకోవాలని కూడా సూచించారు. ఈ ఆసక్తికర సన్నివేశం బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చోటుచేసుకుంది.
2024 ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో జగన్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించడంతో పాటుగా సంచలనాత్మక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపునకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగన్ తన పనితీరు పట్ల జనం ఏమనుకుంటున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు.
పార్టీకి చెందిన గ్రాఫ్‌ను మొత్తం 100 శాతం అనుకుంటే... అందులో తన పనితీరు గ్రాఫ్ 60 శాతమని తెలిపిన జగన్.. తన గ్రాఫ్ బాగానే ఉందని చెప్పుకొచ్చారు. మిగిలిన 40 శాతం గ్రాప్ పార్టీ నేతలదేనని చెప్పిన జగన్... ఎవరి గ్రాఫ్ బాగుంటే వారికే టికెట్లు కేటాయిస్తామని చెప్పారు.