KCR: ప్రధాని మోదీపై కేసీఆర్ ఘాటు విమర్శలు
- టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా కేసీఆర్ కీలక ప్రసంగం
- ఈ దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్న
- ఏ రంగంలో అభివృద్ధి సాధించారో చెప్పాలని డిమాండ్
- మనిషి కోసం మతమా? మతం కోసం మనిషా? అని అడిగిన సీఎం
- పన్నులు పెంచిన పాపాల భైరవులు కేంద్రం పెద్దలేనన్న కేసీఆర్
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జరుగుతున్న ఆ పార్టీ ప్లీనరీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు గుప్పించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను ప్రస్తావించిన కేసీఆర్.. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై నిందలేస్తూ సాగుతోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... "ఈ దేశానికి మోదీ ఏం చేశారు? ఏ రంగంలో అభివృద్ధి సాధించారో చెప్పాలి. ఇస్లామిక్ దేశాల్లో హిందూ ఆలయాలు కడుతున్నారు. మన దేశంలో అశాంతి చెలరేగేలా రెచ్చగొడుతున్నారు. ఉద్వేగం, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ కత్తులు పట్టుకుని ఊరేగుతారా? ప్రసంగాల జోరు, అబద్ధాల హోరు తప్ప దేశానికి జరిగిందేమీ లేదు. దీనిని అడ్డుకోకపోతే భయంకరమైన పరిణామాలు వస్తాయి.
ప్రధాని మోదీ డ్రామాలాడుతున్నారు. పెట్రోల్‌పై రాష్ట్రం ఒక్క పైసా పెంచలేదు. పెట్రోలు ధరల పెంపు పాపం కేంద్రానిదే. పన్నులు పెంచిన పాపాల భైరవులు కేంద్రం పెద్దలే. పొద్దున లేస్తే మత రాజకీయాలు చేస్తున్నారు. మనిషి కోసం మతమా? మతం కోసం మనిషా? మనుషుల మధ్య తగాదాలు పెట్టేందుకు మతాన్ని వాడుతున్నారు" అంటూ కేసీఆర్ ఘాటు విమర్శలు గుప్పించారు.