Telangana: నేడు, రేపు మండిపోనున్న సూర్యుడు.. జాగ్రత్తగా ఉండాలంటున్న వాతావరణశాఖ
- ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత
- నేడు, రేపు కూడా నిప్పులు కురిపించనున్న భానుడు
- కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణ ప్రజలు నేడు, రేపు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ రెండు రోజుల్లో భానుడు చండ్ర నిప్పులు చెరగనున్నాడని, కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నిన్న కూడా సూర్యుడు భగభగలాడుతూ చెమటలు కక్కించాడు. ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే కావడం గమనార్హం.
అలాగే, మరో పది జిల్లాల్లోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఆయా జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 నుంచి 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, భానుడి ప్రతాపం నేడు, రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.