Andhra Pradesh: ఆయన భార్యకు పదవి ఇవ్వకూడదని ఏ చట్టంలో రాసి ఉంది?: ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న
- భర్తపై ఆరోపణలు ఉంటే భార్యకు పదవి ఇవ్వకూడదనడం సరికాదన్న ధర్మాసనం
- లాలూప్రసాద్ స్థానంలో రబ్రీదేవి ముఖ్యమంత్రి కాలేదా? అని ప్రశ్న
- శ్రీభోగేశ్వరస్వామి విశాల సహకార పరపతి సంఘం కేసులో హైకోర్టు వ్యాఖ్యలు
తప్పు చేసినట్టు భర్త ఆరోపణలు ఎదుర్కొంటే అన్ని అర్హతలు ఉన్న ఆయన భార్యకు పదవి ఇవ్వకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలంటూ పిటిషనర్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన, భర్త తప్పులను ఆమెపై రుద్దకూడదని, ఆమెకు అన్ని అర్హతలు ఉన్నప్పుడు పదవి చేపట్టకూడదని చెప్పడం సరికాదని పేర్కొంది. అంతేకాదు, బీహార్‌లో అప్పటి ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పదవి నుంచి తప్పుకున్నప్పుడు ఆయన భార్య రబ్రీదేవి పదవి చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోతునూరు సమీపంలోని శ్రీభోగేశ్వరస్వామి విశాల సహకార పరపతి సంఘం మేనేజింగ్ కమిటీ ఇన్చార్జ్ చైర్‌పర్సన్‌గా ధూళిపాళ్ల రమాదేవిని నియమించడాన్ని సవాలు చేస్తూ మరో ఇద్దరితో కలిసి ఎస్.రమేశ్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం వద్ద వ్యాజ్యం దాఖలు చేశారు. తప్పు చేశారన్న ఆరోపణలతో రమాదేవి భర్తను మేనేజింగ్ కమిటీ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించారని, అలాంటప్పుడు ఆ స్థానంలో ఆయన భార్యను ఎలా నియమిస్తారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే, ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు ఏకసభ్య ధర్మాసనం నిరాకరించడంతో పిటిషనర్ రమేష్ డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసుకున్నారు. పలు ఆరోపణలతో పదవి కోల్పోయిన వ్యక్తి భార్యకు అదే పదవి ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. భర్త తప్పు చేస్తే అన్ని అర్హతలు ఉన్న ఆయన భార్యకు పదవి ఇవ్వడం తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం పూర్తిస్థాయి విచారణను జూన్‌కు వాయిదా వేసింది.