Andhra Pradesh: ఏపీ రాజధాని ప్రాంతంలో మరో దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం, హత్య

Yet Another Rape Incident In Capital Region

  • గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఘటన
  • నలుగురిపై అనుమానాలు
  • ఘటనలపై ప్రభుత్వానికి సీరియస్ నెస్ లేదన్న మాజీ మంత్రి కె.ఎస్. జవహర్
  • తెలంగాణలో నిందితుడిని కాల్చి చంపారంటూ కామెంట్

విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన మరువకముందే.. రాజధాని ప్రాంతంలో మరో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. 

ఈ ఘటన గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడి హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

కాగా, ఘటనకు సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సేకరిస్తోంది. చనిపోయిన మహిళకు బంధువైన ఓ యువకుడు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె ఇంటికి వెళ్లాడు. అచేతనంగా పడి ఉన్న ఆ మహిళను చూసి యువకుడు 108, పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చి మృతదేహానికి పంచనామా చేసి ఆసుపత్రికి తరలించారు. 

ఒంటిపై అయిన గాయాలు, దుస్తులు సరిగ్గా లేకపోవడం ఆధారంగా ఆమెపై అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఆ మహిళకు పదిహేనేళ్ల క్రితం పెళ్లయింది. ఆ దంపతులకు కుమార్తె, కుమారుడున్నారు. ఆమె భర్త పనుల కోసం ఒక్కోసారి బయటకు వెళ్తుంటారని, ఐదారునెలల దాకా రారని చెబుతున్నారు. 

ఇప్పుడు కూడా రైల్వే పనుల కోసం తిరుపతి వెళ్లాడు. భార్య మరణం గురించి ఫోన్ లో తెలియజేయగా.. తన భార్య హత్యపై అనుమానాలున్నాయని చెప్పారు.  

ఘటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ స్పందించారు. హోం మంత్రికిగానీ, ప్రభుత్వానికిగానీ ఇలాంటి ఘటనలపై సీరియస్ నెస్ లేదని, అందుకే ఈ ఘటనలు పెరిగిపోతున్నాయని అన్నారు. సుచరిత అనంతరం హోం మంత్రిగా వనిత బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ఘటనలు బాగా పెరిగాయని, 20 నుంచి 30 ఘటనల వరకు జరిగాయని అన్నారు. 

తెలంగాణలో ఇలాంటి ఘటనలే జరిగితే.. నిందితులను కాల్చి చంపారని, కానీ, ఏపీలో మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను సజ్జల రామకృష్ణారెడ్డి తన చేతుల్లో పెట్టుకున్నారని, మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని ఆరోపించారు. ‘సకల శాఖలను సజ్జలనే చూసుకోవాలి.. జగన్ పబ్జీ ఆడుకోవాలి.. జనాల మానప్రాణాలు గాల్లో కలిసిపోవాలి’ అంటూ ఎద్దేవా చేశారు. 

శాంతి భద్రతల పరిరక్షణ తన వల్ల కావడం లేదంటూ హోం మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. హోం మంత్రి మారినా.. మహిళల మాన ప్రాణాలను కాపాడడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందన్నారు. హోం మంత్రి సంఘటన స్థలానికి వెళ్లాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జవహర్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News