mahender reddy: వైర‌ల్ అవుతోన్న‌ ఆ ఆడియో నాది కాదు: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

mahender reddy on audio

  • తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిని తిట్టిన‌ట్లు ఆడియో
  • ఈ విష‌యాన్ని కోర్టులో తేల్చుకుంటానన్న మ‌హేంద‌ర్ రెడ్డి
  • ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం
  • ఎమ్మెల్యే రోహిత్ రెడ్డే ఇదంతా చేయిస్తున్నారని వ్యాఖ్య‌

వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిపై రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న ఓ ఆడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. గ‌త శనివారం తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులతో కూర్చున్నార‌ని, అయిన‌ప్ప‌టికీ సీఐ రాజేందర్‌రెడ్డి వారికి అడ్డు చెప్ప‌లేద‌ని మహేందర్‌రెడ్డి నిన్న‌ మధ్యాహ్నం సీఐకి ఫోన్ చేసి దూషించిన‌ట్లు స‌మాచారం. 

దీంతో మ‌హేంద‌ర్ రెడ్డిని 'సర్‌ మంచిగా మాట్లాడండి' అని సీఐ అన్నారు. మ‌హేంద‌ర్ రెడ్డి మ‌రింత ఆగ్ర‌హానికి గురై బూతులు తిట్టిన‌ట్లు ఆ ఆడియోలో విన‌ప‌డుతోంది. దీంతో మహేందర్‌రెడ్డి తనను దూషించడంపై ఇప్ప‌టికే తాను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాన‌ని సీఐ తెలిపారు. మహేందర్‌రెడ్డి తీరుపై రోహిత్‌రెడ్డి మ‌ద్ద‌తుదారులు గ‌త‌రాత్రి తాండూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు.
 
దీనిపై ఈ రోజు మ‌హేంద‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోన్న‌ ఆ ఆడియో తనది కాదని అన్నారు.  తాను ఈ విష‌యాన్ని కోర్టులో తేల్చుకుంటానని, ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డే ఇదంతా చేయిస్తున్నారని ఆయ‌న అన్నారు. 

పోలీసులు త‌న‌కు నోటీసు ఇస్తే విచారణ‌ ఎదుర్కొంటాన‌ని చెప్పారు. త‌న‌పై రోహిత్ రెడ్డి ఉద్దేశ‌పూర్వ‌కంగా తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆయ‌న అన్నారు. భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తన ముందుకు రౌడీ షీటర్లు వచ్చార‌ని, త‌న‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నాలు చేశార‌ని చెప్పారు.  దీనిపై తాను రూరల్, టౌన్ సీఐతో మాట్లాడాన‌ని తెలిపారు. పోలీసులు అంటే తనకు గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News