Google: భాగ్యనగరిలో గూగుల్ రెండో అతిపెద్ద క్యాంపస్... నిర్మాణం పనులు ప్రారంభించిన కేటీఆర్
- మాదాపూర్‌లో గూగుల్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్
- 3.3 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం
- 94 మీటర్ల ఎత్తుతో 29 అంతస్తులతో భననం
- కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన పనులు
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ హైదరాబాద్‌లో తన క్యాంపస్ నిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టింది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గూగుల్... అమెరికాలోనే తన అతి పెద్ద కార్యాలయాన్ని కలిగి ఉంది. ఆ కార్యాలయం తర్వాత తన రెండో అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు గూగుల్ తెలంగాణ సర్కారుతో ఇదివరకే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సదరు భవనం నిర్మాణ పనులను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్‌లో తన సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ ఏర్పాటుకు చాలా కాలం క్రితమే గూగుల్ అంగీకరించినా... మట్టి తవ్వకం పనులు చాలా కాలం క్రితమే మొదలైనా.. కరోనా కారణంగా ఆ పనులు సుదీర్ఘ కాలం పాటు కొనసాగాయి. తాజాగా ఎట్టకేలకు మట్టి తవ్వకం పనులు పూర్తి కాగా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా భవన నిర్మాణ పనులకు గూగుల్ శ్రీకారం చుట్టింది. ఈ పనులను కేటీఆర్‌తోనే ప్రారభించేసింది.
ఇక ఈ క్యాంపస్ విషయానికి వస్తే... 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ కార్యాలయం నిర్మాణం కానుంది. 29 అంతస్తులతో ఏకంగా 94 మీటర్ల ఎత్తుతో ఈ భవంతి నిర్మితం కానుంది. మాదాపూర్ పరిధిలోని అమేజాన్ క్యాంపస్‌కు అతి సమీపంలో నిర్మితం కానున్న గూగుల్ క్యాంపస్ నగరానికి మరో ల్యాండ్ మార్క్‌గా నిలవనుందని కేటీఆర్ తెలిపారు.