AP High Court: ఏపీ ఐఏఎస్‌లకు ఊరట... సామాజిక సేవా శిక్షను వాయిదా వేసిన హైకోర్టు
- కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ 89 మంది ఐఏఎస్‌లు
- తొలుత జైలు శిక్ష, ఆ తర్వాత సామాజిక సేవా శిక్షను విధించిన కోర్టు
- సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన ఐఏఎస్‌లు
- శిక్ష అమలును 8 వారాల పాటు వాయిదా వేసిన డివిజన్ బెంచ్
ఏపీలో కోర్టు ధిక్కరణకు పాల్పడి జైలు శిక్ష, జరిమానాకు గురై... బేషరతుగా న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పి, జైలు శిక్షను సామాజిక సేవా శిక్షగా మార్పించుకున్న 8 మంది ఐఏఎస్ అధికారులకు తాజాగా మరింత ఊరట దక్కింది. ఐఏఎస్‌లకు విధించిన సామాజిక సేవా శిక్షను 8 వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
పాఠశాలల ఆవరణలో సచివాలయాల నిర్మాణం వద్దంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఏపీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీనిపై పలుమార్లు విచారణ సాగగా...అధికారుల తీరులో మార్పు రాకపోగా.. దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విదిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల సంచలన తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి శిక్షను ఖరారు చేస్తున్న సమయంలో కోర్టులోనే ఉన్న 8 మంది ఐఏఎస్‌లు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో జైలు శిక్షను కాస్తా... ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకు ఒక రోజు సేవ చేసేలా సామాజిక సేవా శిక్షగా కోర్టు మార్చింది.
ఈ తీర్పుపై ఇప్పటికే ఇద్దరు ఐఏఎస్‌లు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా..వారి శిక్షను వాయిదా వేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మిగిలిన ఆరుగురు ఐఏఎస్‌లు కూడా హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. వీటి పిటిషన్లను విచారించిన డివిజన్ బెంచ్.. వీరికి కూడా ఊరట కల్పిస్తూ సామాజిక సేవా శిక్షను 8 వారాల పాటు వాయిదా వేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.