Alla Ramakrishna Reddy: ప్రశాంతంగా ఉన్న పల్లెలో నారా లోకేశ్ హింసకు తెరలేపారు: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

YCP MLA Alla Ramakrishna Reddy slams Nara Lokesh
  • గుంటూరు జిల్లాలో మహిళ హత్య
  • తుమ్మపూడి వెళ్లిన లోకేశ్
  • గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలు
  • లోకేశ్ పై రాళ్ల దాడి
  • ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే 
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఓ మహిళ హత్యకు గురైన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. బాధితుల పరామర్శ కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తుమ్మపూడి రాగా, తీవ్రస్థాయిలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పందించారు. 

పచ్చని పల్లెలో నారా లోకేశ్ హింసకు తెరలేపారని ఆరోపించారు. ప్రశాంత వాతావరణాన్ని లోకేశ్ చెడగొడుతున్నారని విమర్శించారు. భారీగా కార్యకర్తలతో వచ్చి హడావుడి చేశారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఎవరైనా పరామర్శకు వచ్చే వాళ్లు అన్ని వాహనాలతో వస్తారా? అని ప్రశ్నించారు. మృతదేహాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. మేం విపక్షంలో ఉన్నప్పుడు ఇలా జరిగిందా? అని ప్రశ్నించారు. 

రాజకీయ లబ్ది కోసమే లోకేశ్ డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. గత 8 ఏళ్లలో ఇలాంటి ఘటనలు జరగలేదని ఆర్కే అన్నారు. పోలీసుల విచారణకు కూడా సమయం ఇవ్వరా? అంటూ టీడీపీ నేతలను నిలదీశారు. పోస్టుమార్టం నివేదికలో అన్ని విషయాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన 3 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని ఆర్కే వెల్లడించారు.
Alla Ramakrishna Reddy
Nara Lokesh
Thummapudi
Guntur District
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News