Google: ఇకపై గూగుల్ లో ఉన్న ఫోన్ నెంబర్లు తొలగించుకోవచ్చు!

Google agrees to remove phone numbers from search engine
  • ఇంటర్నెట్లో వివరాలతో సైబర్ మోసాల ముప్పు
  • ఫోన్ నెంబర్లు తొలగించాలంటూ గూగుల్ కు వినతులు
  • పరిగణనలోకి తీసుకున్న గూగుల్
ఇంటర్నెట్లో వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయడం చాలా ప్రమాదకరం. అనేక అంశాలతో ముడిపడి ఉండే ఫోన్ నెంబర్లు ఇంటర్నెట్లో పబ్లిగ్గా పేరుతో సహా దర్శనమిస్తుంటే సైబర్ నేరగాళ్లు, ఇతర మోసగాళ్లు ఊరుకుంటారా? అందుకే... తమ సెర్చ్ ఇంజిన్ పరిధిలో ఉన్న ఫోన్ నెంబర్లను తొలగించేందుకు గూగుల్ ఎట్టకేలకు సమ్మతించింది. 

గతంలో గూగుల్ బ్యాంకు ఖాతాల వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలు మాత్రమే తొలగించేందుకు వెసులుబాటు కల్పించింది. తమ వివరాలు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఉంటే వాటిని తొలగించాలని గూగుల్ ను కోరే వీలుండేది. ఇప్పుడా వెసులుబాటును ఫోన్ నెంబర్లు, చిరునామాల తొలగింపునకు కూడా విస్తరిస్తూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఫోన్ నెంబర్లను తొలగించాలంటూ ఇటీవల గూగుల్ కు పెద్ద సంఖ్యలో వినతులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ గ్లోబల్ పాలసీ విభాగం చీఫ్ మిచెల్లీ చాంగ్ వెల్లడించారు. 

అయితే, గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఉన్న వివరాలను మాత్రమే తాము తొలగించగలమని, ఇతర సంస్థల సెర్చ్ ఇంజిన్లలో కనిపించే వివరాలను తాము తొలగించలేమని, ఆయా వెబ్ సైట్లను సంప్రదించి తమ వివరాలు తొలగించాలని యూజర్లు కోరాలని గూగుల్ తన బ్లాగ్ లో పేర్కొంది. ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో యూజర్ల విజ్ఞప్తులను పరిశీలించిన గూగుల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Google
Phone Numbers
Search Engine
Internet

More Telugu News