Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫిలిం జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ
- ప్రతి సినిమాకు ముందు టీఎఫ్‌జేకు రూ. లక్ష ఇస్తానని హామీ
- సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు ఇవ్వాలనుకోవడం శుభపరిణామమన్న మెగాస్టార్
- టీఎఫ్‌జేకు రూ. 5 లక్షలు ప్రకటించిన మంత్రి తలసాని
తన కెరియర్ ప్రారంభంలో ‘ప్రాణం ఖరీదు’ సినిమా చేస్తున్నప్పుడు తన గురించి ఎవరైనా రాస్తే బాగుంటుందని అనుకున్నానని, ఆ సమయంలో పసుపులేటి రామారావుగారి రాసిన ఆర్టికల్ తనను ఎంతగానో కదిలించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ) ఆధ్వర్యంలో ఫిలిం జర్నలిస్టులకు నిన్న మెగాస్టార్ చేతుల మీదుగా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, దర్శకుడు అనిల్ రావిపూడి, ఎతికా ఇన్సూరెన్స్ సీఈవో రాజేంద్ర, టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వి. లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్డుల ప్రధానోత్సవం అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. జర్నలిస్టులను చూస్తుంటే తన బంధువులన్న భావన కలుగుతుందన్నారు. పసుపులేటిగారు తనపై ఆర్టికల్ రాసిన తర్వాత ఆయనకు థ్యాంక్స్ చెబుతూ వంద రూపాయలు ఇస్తే ఆయన తిరస్కరించారని, తాను డబ్బుల కోసం రాయలేదని, అది తన బాధ్యత అని అన్నారని చెప్పారు. ఆయన మాటలు జర్నలిస్టులపై మరింత గౌరవాన్ని పెంచాయన్నారు. ఆయన మరణించే వరకు ఆయనపైన ఉన్న గౌరవం అలానే ఉందన్నారు.
అలాగే గుడిపూడి శ్రీహరి, వీఎస్ఆర్ ఆంజనేయులు, నందగోపాల్ వంటి వారి నుంచి ఎన్నో నేర్చుకున్నట్టు చెప్పారు. మంత్రి శ్రీనివాస యాదవ్ సూచన మేరకు ప్రతి సినిమాకు ముందు లక్ష రూపాయల చొప్పున టీఎఫ్‌జే అసోసియేషన్ కు ఇస్తానని ప్రకటించారు. భవిష్యత్తులోనూ తన సహాయ సహకారాలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సినిమా రంగానికి ఎలాంటి అవార్డులు లేవని, ఇప్పుడు టీఎఫ్‌జేఏ నడుంకట్టి దక్షిణాది పరిశ్రమ మొత్తాన్ని కలుపుతూ సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు ఇవ్వాలనుకోవడం శుభపరిణామమని చిరంజీవి కొనియాడారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ.. సినిమా జర్నలిస్టులకు క్రమశిక్షణ ఎక్కువని, వారికి రాజకీయాలు తెలియవని అన్నారు. కరోనా సమయంలో చిరంజీవితోపాటు తాను కూడా ఎంతోమందికి నిత్యావసరాలు అందించినట్టు చెప్పారు. తన వంతు సాయంగా టీఎఫ్‌జేఏకు రూ. 5 లక్షలు అందిస్తానన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఏ చరిత్ర అయినా జర్నలిస్టు రాసిన సిరాతోనే ప్రారంభమవుతుందని, అందుకనే వారంటే గౌరవమని అన్నారు. అసోసియేషన్‌ను ముందుకు నడుపుతున్న కార్యవర్గాన్ని అభినందించారు. ఎతికా ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీవోవో రాజేంద్ర మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం జర్నలిస్టు మిత్రులు తనను కలిసి అడగడంతో ఇన్సూరెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.