New Delhi: ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం: ఆసుపత్రులు, మెట్రోకు కరెంట్ కోతలు తప్పవని హెచ్చరించిన కేజ్రీవాల్ సర్కార్!
- దాద్రి 2, ఉంఛార్ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు కొరత
- 30 శాతం కరెంట్ వాటి నుంచే సరఫరా
- అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న కేజ్రీవాల్
- విద్యుత్ సంక్షోభం దిశగా దేశమన్న ఆలిండియా ఇంజనీర్స్ ఫెడరేషన్
తీవ్రంగా వేధిస్తున్న బొగ్గు కొరతతో ఢిల్లీ చీకట్లలో మగ్గే పరిస్థితి వచ్చి పడింది. దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం వచ్చి పడింది. నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఆసుపత్రులు, మెట్రోకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విద్యుదుత్పత్తి కేంద్రాలకు సరిపోనూ బొగ్గు నిల్వలను పంపించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. దాద్రి 2, ఉంఛార్ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అయిపోవచ్చాయని, దీంతో రాజధానిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. దేశ రాజధాని విద్యుత్ లో 25 నుంచి 30 శాతం వరకు అవసరాలను ఈ రెండు విద్యుత్కేంద్రాలే తీరుస్తున్నాయన్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, వీలైనంత వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని చెప్పారు.
ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ స్పందించారు. సంక్షోభ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఈ విద్యుత్ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయాలని కేంద్రాన్ని కోరారు.
వాస్తవానికి ఢిల్లీ కరెంట్ అవసరాలను తీర్చేందుకు గానూ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్.. దాద్రి 2, ఝజ్జర్ (ఆరావళి) విద్యుత్కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, వాటిలోనూ బొగ్గు నిల్వలు అడుగంటిపోతున్నాయి. ఖలగావ్, ఫరక్కా, దాద్రి 2, ఉంఛార్, ఝజ్జర్ విద్యుత్కేంద్రాల నుంచి ఢిల్లీకి నిత్యం 1,751 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. అందులో 728 మెగావాట్లు ఒక్క దాద్రి 2 నుంచే సరఫరా కావడం విశేషం.
దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటి పోతున్నాయని, దేశం విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయే ముప్పుందని ఆలిండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ హెచ్చరించింది. బొగ్గు కొరతపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. విద్యుదుత్పత్తికి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్యాసింజర్ రైళ్లకు బదులు బొగ్గు రవాణా కోసం ఎక్కువ రైళ్లను నడపాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.