India: ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలోనే తొలిసారి... భారత్ లో శాట్నావ్ టెక్నాలజీతో విమానం ల్యాండింగ్
- దేశీయంగా నావిగేషన్ వ్యవస్థ అభివృద్ధి చేసిన భారత్
- గగన్ పేరిట సొంత శాటిలైట్ నావిగేషన్
- ఢిల్లీ నుంచి అజ్మీర్ కు విమానం
- శాటిలైట్ నావిగేషన్ తో సురక్షితంగా ల్యాండైన వైనం
శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతి కనబరుస్తున్న భారత్ మరో ఘనత సాధించింది. శాటిలైట్ నావిగేషన్ (శాట్నావ్) టెక్నాలజీని విమానాల ల్యాండింగ్ లో ఉపయోగించిన తొలి ఆసియా ఫసిఫిక్ దేశంగా నిలిచింది. రాజస్థాన్ లోని అజ్మీర్ విమానాశ్రయంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఓ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది.
అమెరికా జీపీఎస్, చైనా బీడో, యూరప్ దేశాల గెలీలియో నావిగేషన్ వ్యవస్థలకు దీటుగా భారత్ గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్) పేరిట సొంత నావిగేషన్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడం తెలిసిందే. ఇస్రో ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలో మోహరించి భారత్ పటిష్టమైన నావిగేషన్ వ్యవస్థను నిర్మించింది. గగన్ ప్రత్యేకత ఏంటంటే త్రీడీ విధానంలో మార్గదర్శనం చేస్తుంది. అజ్మీర్ ఎయిర్ పోర్టులో కూడా సదరు విమానం త్రీ డైమన్షనల్ నావిగేషన్ సపోర్టుతో సురక్షితంగా కిందికి దిగింది.
పౌరవిమానయాన చరిత్రలో ఇదో కీలక ఘట్టం అని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వెల్లడించింది. ఇప్పటివరకు భారత్ లో విమానాల ల్యాండింగ్ అంతా గ్రౌండ్ కంట్రోల్ పర్యవేక్షణ ద్వారానే జరుగుతున్నాయి. ఇకపై, శాటిలైట్ టెక్నాలజీతో విమానాల ల్యాండింగ్ కార్యకలాపాలు జరుగుతాయని, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఘనత సాధించిన తొలిదేశం మనదేనని ఏఏఐ పేర్కొంది.
కాగా, శాట్నావ్ టెక్నాలజీని పరీక్షించే క్రమంలో ఏటీఆర్ విమానం ఢిల్లీ నుంచి అజ్మీర్ లోని కిషన్ గఢ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. విమానాన్ని కెప్టెన్ సందీప్ సూద్, కెప్టెన్ సతీశ్ వీరా, కెప్టెన్ శ్వేతా సింగ్ నడిపారు. వారితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ (డీజీసీఏ) ఉన్నతాధికారులు కూడా ఆ విమానంలో ప్రయాణించారు.
ఈ విధానానికి డీజీసీఏ తుది అనుమతులు మంజూరు చేస్తే ఇకపై పౌర విమానాలు శాటిలైట్ నావిగేషన్ విధానంలో ల్యాండింగ్ కానున్నాయని ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది.