Danish Kaneria: నేను హిందువుని కావడంతో అఫ్రిది విపరీతంగా ద్వేషించేవాడు: పాక్ మాజీ స్పిన్నర్ కనేరియా

Pakistan former leggie Danish Kaneria alleges Afridi hated him most

  • గతంలో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కనేరియా
  • 61 టెస్టుల్లో 261 వికెట్లు పడగొట్టిన లెగ్ స్పిన్నర్
  • తనంటే అఫ్రిదికి గిట్టదని వెల్లడి
  • తనను బహిష్కరించాలని ఆటగాళ్లకు నూరిపోసేవాడని ఆరోపణ

గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు సజావుగా ఆడుతోంది కానీ, కొన్నాళ్ల కిందట ఆ జట్టులో తీవ్రస్థాయిలో లుకలుకలు ఉండేవి. ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయేవారు. దానికితోడు మ్యాచ్ ఫిక్సింగ్ అవినీతి... ఆ జట్టు ప్రతిష్ఠను మసకబార్చాయి. మహ్మద్ అమీర్, సల్మాన్ భట్ వంటి ప్రతిభావంతులు అవినీతి కారణంగా నిషేధం ఎదుర్కొన్నారు. ఎంతో నైపుణ్యం ఉన్న లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని, నిషేధానికి గురయ్యాడు.

కనేరియా 2000 సంవత్సరంలో పాక్ జట్టులో స్థానం సంపాదించాడు. కెరీర్ లో 61 టెస్టులాడి 261 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. 2009లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో అతడిపై వేటు వేశారు. 

తాజాగా, డానిష్ కనేరియా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పట్లో జట్టులో పరిస్థితి ఎలా ఉండేదో వివరించాడు. ముఖ్యంగా, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వ్యవహార శైలిపై కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. తాను హిందువును కావడంతో తనను అఫ్రిది విపరీతంగా ద్వేషించేవాడని వెల్లడించాడు. అంతేకాదు, పాకిస్థాన్ దేశంలో నాకు చోటు లేదని, నన్ను జట్టు నుంచి బహిష్కరించాలని ఇతర ఆటగాళ్లకు కూడా నూరిపోసేవాడు అని కనేరియా ఆరోపించాడు. 

అఫ్రిది క్యారెక్టర్ లేని వాడని తనకు తెలుసని, అందుకే అతడి మాటలు పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవాడ్నని వివరించాడు. ఏదేమైనా, జట్టులో ఉన్నంతకాలం అఫ్రిది తనను ద్వేషిస్తూనే ఉన్నాడని, అతడికి ఎందుకంత కడుపుమంట అనేది అర్థం అయ్యేది కాదని అన్నాడు. అఫ్రిది కెప్టెన్ గా ఉన్నప్పుడు తనకు తుది జట్టులో చోటు కల్పించేవాడు కాదని, రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసేవాడని ఆరోపించాడు. అఫ్రిది వంటి అబద్ధాల కోరును ఎక్కడా చూడబోమన్నాడు. 

అయితే, పాకిస్థాన్ జాతీయ జట్టుకు ఆడడాన్ని మాత్రం అదృష్టంగా భావిస్తానని, తనకు జీవితంలో లభించిన భాగ్యం అని కనేరియా పేర్కొన్నాడు. కాగా, తనపై విధించిన నిషేధంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పునఃసమీక్షించాలని, లీగ్ క్రికెట్లో ఆడే వీలు కల్పించాలని కోరాడు. ఫిక్సింగ్ కు పాల్పడినవాళ్లు హాయిగా తిరుగుతున్నారని, తన అంతర్జాతీయ క్రికెట్ ఎలాగూ ముగిసిపోయిందని, కనీసం టీ20 ఫ్రాంచైజీ లీగ్ పోటీల్లోనైనా ఆడేందుకు అవకాశమివ్వాలని కనేరియా విజ్ఞప్తి చేశాడు.

  • Loading...

More Telugu News