Telangana: తెలంగాణలో త్వరలోనే జాబ్ కేలండర్: మంత్రి హరీశ్ రావు
- ఇప్పటికే జాబ్ నోటీఫికేషన్లు జారీ చేశాం
- ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం
- రైతులకు బీజేపీ సర్కారు ఏం చేసిందన్న హరీశ్ రావు
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శుక్రవారం ప్రకటించారు. ఈ దిశగా త్వరలోనే జాబ్ కేలండర్‌ను ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిందని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించిన హరీశ్ రావు.. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ రైతుల ఖర్చులను మాత్రం రెట్టింపు చేయగలిగిందన్నారు. రైతుల రుణమాఫీ చేయని బీజేపీ.. బ్యాంకు రుణాల ఎగవేతదారుల బ్యాంకుల రుణాలు మాఫీ చేసిందని మండిపడ్డారు. బీజేపీ సర్కారు రైతులకు ఏం చేసిందో ఒక్క మంచి పని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు,