Kangana Ranaut: హిందీ భాషను నిరాకరించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టే: కంగనా రనౌత్
- సినీ నటుల మధ్య హిందీ వివాదం
- అజయ్ దేవగణ్, కిచ్చా సుదీప్ మధ్య ట్వీట్ల యుద్ధం
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా
ఇటీవల కొన్నిరోజులుగా ఉత్తర, దక్షిణాది నటుల మధ్య హిందీ భాషా వివాదం చోటు చేసుకోవడం తెలిసిందే. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, కన్నడ కథానాయకుడు కిచ్చా సుదీప్ ల మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. ఈ నేపథ్యంలో, బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీనే మన జాతీయ భాష అని స్పష్టం చేసింది. అప్పటికీ, ఇప్పటికీ, ఇంకెప్పటికైనా హిందీనే జాతీయ భాష అంటూ ట్వీట్ చేసిన అజయ్ దేవగణ్ కు మద్దతు పలికింది. హిందీని జాతీయ భాషగా అంగీకరించకపోవడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని పేర్కొంది.
అయితే, సంస్కృతాన్ని జాతీయ భాష చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని కంగనా వెల్లడించింది. హిందీ, ఇంగ్లీషు, జర్మనీ, ఫ్రెంచ్ తదితర భాషలన్నీ కూడా సంస్కృతం నుంచి పుట్టుకొచ్చినవేనని వెల్లడించింది. "సంస్కృతాన్ని మన భారత జాతీయ భాషగా ఎందుకు ప్రకటించకూడదు? స్కూళ్లలో సంస్కృతాన్ని ఎందుకు తప్పనిసరి చేయకూడదు?" అని వ్యాఖ్యానించింది. తన కొత్త చిత్రం 'ధాకడ్' ట్రైలర్ విడుదల సందర్భంగా కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది.