Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు... ఫిఫ్టీ కొట్టిన కోహ్లీ
- గుజరాత్ వర్సెస్ బెంగళూరు
- మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ
- 45 బంతుల్లోనే అర్ధసెంచరీ
- 52 పరుగులు చేసి అవుటైన పాటిదార్
ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటిదాకా దారుణ వైఫల్యం చవిచూసిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి బ్యాట్ ఝుళిపించాడు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో అర్ధసెంచరీతో చెలరేగాడు. తనపై తీవ్రస్థాయిలో వస్తున్న విమర్శలకు కోహ్లీ బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. 45 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. టోర్నీ ఆరంభం నుంచి పరుగుల దాహంతో అల్లాడుతున్న ఆర్సీబీ మాజీ సారథి ఈ మ్యాచ్ లో పాత కోహ్లీని చూపించాడు.
మరో ఎండ్ లో రజత్ పాటిదార్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకోగా, కెప్టెన్ డుప్లెసిస్ ఆరంభంలోనే డకౌట్ అయ్యాడు. ఓపెనర్ గా బరిలో దిగిన కోహ్లీ... పాటిదార్ తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ప్రస్తుతం బెంగళూరు జట్టు స్కోరు 15 ఓవర్లలో 2 వికెట్లకు 117 పరుగులు. పాటిదార్ 32 బంతులాడి 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. కోహ్లీ 55 పరుగులతో ఆడుతున్నాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. కోహ్లీ జతగా మ్యాక్స్ వెల్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.