Ruturaj Gaikwad: సన్ రైజర్స్ బౌలింగ్ ను ఊచకోత కోసిన చెన్నై ఓపెనర్లు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- ఉతికారేసిన రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే
- 99 పరుగులు చేసిన గైక్వాడ్
- 85 రన్స్ తో అజేయంగా నిలిచిన కాన్వే
- 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 రన్స్ చేసిన చెన్నై
ఐపీఎల్ తాజా సీజన్ లో మెరుగైన బౌలింగ్ వనరులు ఉన్న జట్టుగా గుర్తింపు పొందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంది. సన్ రైజర్స్ బౌలింగ్ ను చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే చితకబాదారు. రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 99 పరుగులు చేయగా, డెవాన్ కాన్వే కూడా వీరవిహారం చేశాడు. కాన్వే 55 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
గైక్వాడ్, కాన్వే.... మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, మార్ క్రమ్, నటరాజన్ ల బౌలింగ్ ను చీల్చి చెండాడారు. అయితే గైక్వాడ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నటరాజన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆఖర్లో వచ్చిన ధోనీ 8 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లోనూ కాన్వే పరుగుల జోరు కొనసాగింది. దాంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది.
సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీశాడు. అత్యంత వేగంగా బౌలింగ్ చేస్తాడని పేరుపడిన ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, అతడి బౌలింగ్ లోనే చెన్నై ఓపెనర్లు అత్యధిక పరుగులు సాధించారు. 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్ మాలిక్ 48 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఓ బంతిని 154 కిమీ వేగంతో విసరగా, గైక్వాడ్ దాన్ని అద్భుతమైన స్ట్రెయిట్ డ్రైవ్ గా మలిచాడు.