Devendra Fadnavis: ‘బాబ్రీ’ని కూల్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను.. శివసేన నేతలే పత్తాలేరు: ఫడ్నవీస్
- శివసేన ప్రశ్నకు దీటుగా బదులిచ్చిన ఫడ్నవీస్
- కరసేవలో పాల్గొన్న తాను 18 రోజులు జైలులో ఉన్నానని వెల్లడి
- శరద్ పవార్పైనా విమర్శలు గుప్పించిన ఫడ్నవీస్
1990ల ప్రారంభంలో బాబ్రీ నిర్మాణాన్ని పాక్షికంగా పడగొట్టినప్పుడు బీజేపీ నేతలు ఎక్కడున్నారన్న శివసేన ప్రశ్నకు బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చినప్పుడు తాను అక్కడే ఉన్నానని, కానీ శివసేన నేతల్లో ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల తనకు కనిపించలేదని ఎద్దేవా చేశారు. నిన్న నిర్వహించిన బీజేపీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
నాటి కరసేవలో పాల్గొన్న తాను 18 రోజులపాటు బదాయూ సెంట్రల్ జైలులో ఉన్నట్టు ఫడ్నవీస్ చెప్పారు. హనుమాన్ చాలీసా చదువుతామన్న ఎంపీ నవనీత్ రాణా దంపతులను అరెస్ట్ చేయించిన ఉద్ధవ్ థాకరే పార్టీ రాముడి వైపుందా? లేదంటే రావణుడి వైపు ఉందా? అని ప్రశ్నించారు. హనుమాన్ చాలీసా పారాయణం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుస్తుందా? అన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్పైనా ఫడ్నవీస్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇఫ్తార్ విందులకు హాజరైనా నిరుద్యోగ సమస్య తీరదంటూ ఫడ్నవీస్ ఆయనకు కౌంటరిచ్చారు.