sri sathya sai Dist: ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ కార్యకర్తను చితక్కొట్టిన ఎస్సై.. వీడియో వైరల్

SI Attacked Man in Police Station in Sri Sathya Sai Dist

  • దివ్యాంగుల కోటాలో పింఛను అందుకుంటున్న మహిళ
  • తొలగించాలంటూ వైసీపీ నేత ఫిర్యాదు
  • వైసీపీ నేత ఇంటికెళ్లి గొడవ పడిన మహిళ కుమారుడు
  • వీడియో వైరల్ కావడంతో స్పందించిన ఎస్పీ
  • విచారణకు ఆదేశం

ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ కార్యకర్తపై ఓ ఎస్సై చెలరేగిపోయాడు. ఏవో పాతకక్షలు ఉన్నట్టుగా అతడిని చూడగానే ఎస్సై ఆగ్రహంతో ఊగిపోతూ.. ఎడాపెడా కొట్టాడు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సంజీవరాయునిపల్లెకు చెందిన పద్మావతమ్మ దివ్యాంగుల కోటాలో పింఛను అందుకుంటున్నారు. ఆమె టీడీపీ మద్దతురాలన్న కారణంతో పింఛను తొలగించాలంటూ స్థానిక వైసీపీ నేత దామోదర్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

విచారించిన గ్రామ సచివాలయ కార్యదర్శి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నట్టు నిర్ధారించడంతో పింఛను కొనసాగుతోంది. మరోపక్క, తల్లి పింఛనను తొలగించేందుకు దామోదర్‌రెడ్డి ప్రయత్నించినట్టు తెలియడంతో పద్మావతమ్మ కుమారుడు గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లి నిలదీశాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో వేణు తాగి తన ఇంటి వద్ద గొడవ చేస్తున్నాడంటూ దామోదర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి వేణును మందలించి వెళ్లారు. 

ఆ తర్వాతి రోజు వేణు మరికొందరితో కలిసి దామోదర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వేణును చూసిన వెంటనే అకారణంగానే ఎస్సై రంగడు చెలరేగిపోయాడు. దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. వేణును చితకబాదుతున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయి చివరికి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పెనుకొండ డీఎస్పీ రమ్యను నియమించారు. 

వేణుపై ఎస్సై రంగడు దాడిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడిపై చేయిచేసుకోవడమేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? అని ఓ ట్వీట్‌లో నిలదీశారు. వేణుపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలు, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. సీఎం జగన్ స్పందించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News