Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం.. నేడు రాజకీయ పార్టీ ప్రకటన?

Prashant kishore hints at being part of elections

  • కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించి విఫలమైన ప్రశాంత్ 
  • భావసారూప్య పార్టీలతో చర్చలు
  • పీకే రాజకీయ పార్టీపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, నేడు ఆయన పార్టీని ప్రకటించనున్నట్టు కూడా ఉత్తరాది రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ట్విట్టర్‌లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీహార్‌లో నిన్న భావసారూప్య పార్టీలతో పీకే చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తోంది. 

కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పీకే ఇటీవల తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీని ప్రక్షాళన చేసి జవసత్వాలు నింపేందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే, పార్టీలోకి ఆయన రాకను కాంగ్రెస్‌ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకించారు. ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ దేశంలోని వివిధ పార్టీలకు పనిచేస్తుండడం, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పీకే చర్చలు జరపడంతో ఆయన తీరుపై కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్‌లో పీకే చేరికకు ఫుల్‌స్టాప్ పడింది. 

కాంగ్రెస్‌లో కీలక స్థానాన్ని ఆశించిన పీకేకు.. ఎన్నికల వ్యూహరచన కమిటీలో సభ్యుడిగా స్థానం కల్పిస్తామని సోనియా గాంధీ చెప్పడంతో మనసు మార్చుకున్న పీకే కాంగ్రెస్‌లో చేరబోవడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారంటూ వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

  • Loading...

More Telugu News