World Busiest Airport: ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుల్లో దుబాయ్ ను వెనక్కి నెట్టిన ఢిల్లీ.. ఎన్నో స్థానంలో ఉందంటే..!
- 2022 మార్చ్ నెలలో అత్యంత రద్దీ అయిన రెండో ఎయిర్ పోర్ట్ గా ఢిల్లీ
- తొలి స్థానంలో అమెరికాలోని అట్లాంటా ఎయిర్ పోర్ట్
- 2019 మార్చ్ లో 23వ స్థానంలో ఉన్న ఢిల్లీ ఎయిర్ పోర్ట్
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ లలో ఢిల్లీ విమానాశ్రయం రెండో స్థానానికి ఎగబాకింది. 2022 మార్చ్ నెలకు గాను గ్లోబల్ ట్రావెల్ డేటా ప్రొవైడర్ సంస్థ 'అఫీషియల్ ఎయిర్ లైన్ గైడ్' (ఓఏజీ) ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయంగా అమెరికాలోని అట్లాంటా ఎయిర్ పోర్ట్ నిలిచింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు రెండో స్థానానికి ఎగబాకడంతో... అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ మూడో స్థానానికి పడిపోయింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... 2019 మార్చ్ నెలలో ప్రపంచ ర్యాంకింగ్స్ లో ఢిల్లీ ఎయిర్ పోర్టు 23వ స్థానంలో ఉంది. కరోనా మహమ్మారికి ముందు 23వ స్థానంలో ఉన్న ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి ఎగబాకడం గమనార్హం.
అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం గత నెలలో పూర్తి స్థాయిలో ఆంక్షలను ఎత్తేసింది. వ్యాక్సిన్ వేయించుకున్న ఎవరైనా రాకపోకలు సాగించేలా పూర్తి వెసులుబాటు కల్పించింది. దీంతో, మన దేశ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ అమాంతం పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ విమానాశ్రయం 35.5 లక్షల సీట్లను హ్యాండిల్ చేయడం గమనార్హం.