Husband: ఏ భార్య కూడా తన భర్తను పరాయి మహిళతో పంచుకోవాలనుకోదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Allahabad High Court Interesting Comments On Repeated Weddings

  • భర్త తనవాడేనన్నది మహిళ భావనన్న కోర్టు 
  • రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడం నేరమేనని వ్యాఖ్య 
  • మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ఒక్క కారణం చాలన్న న్యాయస్థానం  
  • అభియోగాలు కొట్టేయాలన్న వ్యక్తిపై ఆగ్రహం

మన దేశంలో ఏ మహిళ కూడా తన భర్తను పరాయి మహిళతో పంచుకోవాలనుకోదని, వారు తన భర్త తనవాడేనన్న భావనతో ఉంటారని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. వేరే మహిళతో తన భర్త సంబంధం కలిగి ఉంటానంటే ఏ భార్య కూడా భరించలేదన్నారు. భార్య ఆత్మహత్యకు పురిగొల్పాడంటూ కింది కోర్టు నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలంటూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ రాహుల్ చతుర్వేది నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిందితుడు సుశీల్ కుమార్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, దీంతో అతడి భార్య ఆత్మహత్య చేసుకుందని వ్యాఖ్యానించింది. ఓ భార్య తన ప్రాణాలు తీసుకోవడానికి.. భర్త రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడమన్న ఒక్క కారణం చాలని జస్టిస్ రాహుల్ చతుర్వేది అన్నారు. మరో మహిళతో తన భర్త కాపురాన్ని పంచుకోవాలనుకోవడం... ఓ భార్యకు శరాఘాతమేనని అన్నారు. కాగా, చనిపోవడానికి ముందు తన భర్త, అతడి ఆరుగురు కుటుంబ సభ్యులపై వారణాసి పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. 

తన భర్త తనకు తెలియకుండానే మూడో పెళ్లి చేసుకున్నాడని, అతడితో పాటు తన మెట్టినింటివారు మనోవేదనకు గురి చేస్తున్నారని పేర్కొంటూ ఆమె కేసు పెట్టింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో విచారణ సాగుతోంది. తనపై పెట్టిన అభియోగాలను కొట్టేయాలని భర్త ట్రయల్ కోర్టుకు విన్నవించగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో అతడు హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా అతడికి చుక్కెదురైంది.

  • Loading...

More Telugu News