Ola: ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో భారత్ లో నెంబర్ వన్ గా 'ఓలా'
- 12 వేలకు పైగా ఈ-స్కూటర్లు విక్రయించిన ఓలా
- ఇంటివద్దకే డెలివరీ ఇస్తున్న వైనం
- రెండో స్థానంలో ఒకినావా ఆటోటెక్
- సగానికి సగం పడిపోయిన హీరో ఎలక్ట్రిక్ అమ్మకాలు
భారత్ లో విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం ఊపందుకుంటోంది. దిగ్గజ వాహన సంస్థలతో పాటు కొత్త కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రవేశిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ కూడా ఆ విధంగా వచ్చినదే. అయితే, మిగతా సంస్థలను వెనక్కి నెడుతూ ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో ఓలా భారత్ లోనే నెంబర్ వన్ గా అవతరించింది. అమ్మకాల పరంగా ఓలా దూసుకెళుతోంది.
2021లో భారత మార్కెట్లో వాణిజ్యపరంగా అమ్మకాలు షురూ చేసిన ఈ సంస్థ 2022 ఏప్రిల్ నాటికి అత్యధిక విక్రయాలు నమోదు చేసింది. ఓలా ఈ క్రమంలో హీరో ఎలక్ట్రిక్ నుంచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ వాహన్ ప్రకారం... ఓలా ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయిలో 12,683 ఎలక్ట్రిక్ టూ వీలర్లు విక్రయించింది. మార్చి నెల అమ్మకాలతో పోల్చితే 39 శాతం వృద్ధి సాధించింది.
ఇక రెండో స్థానంలో ఒకినావా ఆటోటెక్ నిలిచింది. ఒకినావా ఆటోటెక్ ఏప్రిల్ లో 10 వేల విద్యుత్ ఆధారిత ద్విచక్ర వాహనాలు విక్రయించగా, దిగ్గజ సంస్థ హీరో ఎలక్ట్రిక్ కేవలం 6,570 వాహనాలే విక్రయించింది. ఏప్రిల్ లో హీరో ఎలక్ట్రిక్ అమ్మకాలు 50 శాతం మేర పడిపోయాయి. ఈ ఏడాది మార్చిలో హీరో ఎలక్ట్రిక్ సంస్థ 13 వేల వాహనాలు విక్రయించింది.
2021 నుంచి భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ సంప్రదాయానికి భిన్నంగా తన ఈ-స్కూటర్లను ఇంటివద్దకే డెలివరీ ఇస్తోంది.