Rain: తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు... వాతావరణ కేంద్రం వెల్లడి
- విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి
- నేడు, రేపు, ఎల్లుండి తెలంగాణలో వర్షాలు
- పలుచోట్ల ఈదురుగాలులు
- ఏపీలో రెండ్రోజుల పాటు వర్షాలు
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో గరిష్ఠంగా 40 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.
ఈ నెల 4, 5 తేదీల్లోనూ కొన్ని జిల్లాల్లో ఇదే తరహాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. అయితే, ఈ నెల 6, 7 తేదీల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అటు, ఏపీలోనూ రాగల రెండ్రోజుల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.