Punjab Kings: పంజాబ్ చేతిలో ఓటమి మింగుడు పడడం లేదు: డేవిడ్ మిల్లర్
- ప్రత్యర్థి ఆటలోని కొన్ని అంశాలు అద్భుతమన్న మిల్లర్
- శుభ్ మన్ గిల్ రనౌట్ ఊహించనిదని వ్యాఖ్య
- వరుసగా వికెట్లను నష్టపోవడం దెబ్బతీసిందని కామెంట్
పంజాబ్ కింగ్స్ జట్టు చేతిలో ఓటమిని గుజరాత్ టైటాన్స్ జట్టు జీర్ణించుకోలేకపోతోంది. మంగళవారం నాటి మ్యాచ్ లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకుంది. పంజాబ్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకోవడం తెలిసిందే. దీనిపై గుజరాత్ బ్యాట్స్ మ్యాన్ డేవిడ్ మిల్లర్ స్పందించాడు.
పంజాబ్ చేతిలో ఓటమి మింగడానికి చేదు మాత్ర వంటిదని మిల్లర్ వ్యాఖ్యానించాడు. ‘‘మా జట్టులో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆటగాళ్లు ఎంతో కఠినంగా శిక్షణ పొందుతారు. దాంతో ఎంతో పోటీనిచ్చే విధంగా ఉంటారు. కానీ, నేటి (మంగళవారం) ఫలితం మింగడానికి చేదుగా ఉంది, కానీ, ఐపీఎల్ సీజన్ లో ఇలాంటివి జరుగుతాయి. ఎన్నో మ్యాచ్ లు ఉన్నాయి. కనుక దీన్నుంచి బయటకు వస్తాం’’ అని మిల్లర్ పేర్కొన్నాడు.
వరుస వెంట వికెట్లు నష్టపోతే కష్టమని, మరీ ముఖ్యంగా మొదటి 10 ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం కీలకమని మిల్లర్ అభిప్రాయపడ్డాడు. ‘‘పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి ఒకటి రెండు అద్భుత అంశాలు ఆకట్టుకున్నాయి. నేరుగా విసిరిన బంతి వికెట్లను తాకి శుభ్ మన్ గిల్ రనౌట్ అయ్యాడు. ఎవ్వరూ ఇలా జరుగుతుందని ఊహించరు’’ అని మిల్లర్ పేర్కొన్నాడు.