Botsa: ఎల్లుండి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు... సీసీ కెమెరాలు, స్కానర్లు వినియోగించే అవకాశం
- ఈ నెల 24 దాకా ఇంటర్ పరీక్షలు
- పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెడతాం
- స్కానింగ్ ఏర్పాటుపైనా ఆలోచిస్తున్నామన్న బొత్స
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఎల్లుండి (మే 6) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 దాకా జరగనున్న ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం వెల్లడించారు. పదో తరగతి పరీక్షల్లో భాగంగా ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో... ఇంటర్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన బొత్స... పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు విద్యార్థులకు స్కానింగ్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇక పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే 60 మందిపై చర్యలు తీసుకోగా... వారిలో 35 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారని బొత్స తెలిపారు.