YSRCP: దుగ్గిరాల ఎంపీపీ వైసీపీ ఖాతాలోకే... ఏకగ్రీవంగా ఎన్నికైన సంతోషి రూపరాణి
- దుగ్గిరాల ఎంపీటీసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్న టీడీపీ
- ఎంపీపీ పదవిని బీసీ మహిళకు రిజర్వ్ చేసిన ప్రభుత్వం
- ఆ వర్గానికి చెందిన ఎంపీటీసీ టీడీపీలో లేని వైనం
- సంతోషి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన వైసీపీ
ఏపీ రాజకీయాల్లో అమితాసక్తిని రేకెత్తించిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నిక పూర్తయింది. గెలిచిన ఎంపీటీసీల సంఖ్య పరంగా చూసుకుంటే విపక్ష టీడీపీకే మెజారిటీ ఉన్నా... ఎంపీటీసీ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో పరిస్థితి తారుమారైంది. గురువారం మధ్యాహ్నం దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీకి చెందిన ఎంపీటీసీ సంతోషి రూపరాణి ఎన్నికయ్యారు. ఎంపీపీగా రూపరాణి ఎన్నిక ఏకగ్రీవమైందని ఈ సందర్భంగా అధికారులు ప్రకటించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాలలో టీడీపీకి మంచి పట్టు ఉంది. ఆ పట్టును నిలుపుకుంటూ ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో దుగ్గిరాల మండలంలో మెజారిటీ సీట్లను టీడీపీ దక్కించుకుంది. అయితే ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా... ఆ వర్గానికి చెందిన ఎంపీటీసీలు టీడీపీలో లేకపోయారు. దీంతో వైసీపీ తన అభ్యర్థిగా సంతోషి రూపరాణి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ బీ ఫామ్ అందజేసింది. రూపరాణి అభ్యర్థిత్వం తప్పించి మరెవరి అభ్యర్థిత్వాలు అందకపోవడంతో అధికారులు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆ వెంటనే దుగ్గిరాల ఎంపీపీగా రూపరాణి ప్రమాణస్వీకారం చేశారు.