Rao Saheb Danve: ఓ బ్రాహ్మణుడ్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా: కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే
- మహారాష్ట్రలో వేడెక్కిన రాజకీయాలు
- పరశురామ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి
- బ్రాహ్మణులను సాధారణ నేతలుగా చూడాలనుకోవడంలేదన్న దాన్వే
- ఓ ట్రాన్స్ జెండర్ అయినా సీఎం కావొచ్చన్న అజిత్ పవార్
మహారాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా మారిన నేపథ్యంలో కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే మరింత కాక పుట్టించే వ్యాఖ్యలు చేశారు. ఓ బ్రాహ్మణుడ్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని తన మనసులో మాట వెల్లడించారు. జాల్నాలో పరశురామ జయంతి సందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "బ్రాహ్మణులను కేవలం కార్పొరేటర్ల గానో, పౌర సంఘాల నేతలు గానో చూడాలనుకోవడంలేదు. ఓ బ్రాహ్మణుడు ఈ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడితే చూడాలనుకుంటున్నా" అని స్పష్టం చేశారు.
అంతేకాదు, తాను ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశానని, రాజకీయాల్లో కులతత్వం తీవ్రస్థాయిలో ఉన్న విషయం గుర్తించానని తెలిపారు. అయితే, రాజకీయాల్లో కుల ప్రాబల్యాన్ని విస్మరించలేమని రావు సాహెబ్ అభిప్రాయపడ్డారు. అయితే, కులాలన్నింటిని ఏకతాటిపై నిలిపే నాయకుడు ఒకరు ఉండాలని అభిలసించారు.
ఇక మంత్రి దాన్వే వ్యాఖ్యలు వైరల్ కావడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దీనిపై స్పందించారు. 'ఓ ట్రాన్స్ జెండర్ అయినా సరే, మరెవరైనా సరే, ఏ కులానికి చెందినవారెవరైనా సరే... అసెంబ్లీలో 145 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయిపోవచ్చు' అంటూ అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.