Suriya: హీరో సూర్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: తమిళనాడు కోర్టు ఆదేశాలు
- సూర్య ప్రధాన పాత్రలో జై భీమ్
- గతేడాది విడుదలైన సినిమా
- చిత్రానికి విమర్శకుల ప్రశంసలు
- కోర్టును ఆశ్రయించిన రుద్ర వన్నియార్ సేన
- పిటిషన్ స్వీకరించిన సైదాపేట కోర్టు
తమిళ కథనాయకుడు సూర్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సైదాపేట కోర్టు ఆదేశించింది. సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ చిత్రం గతేడాది రిలీజై విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే ఈ సినిమాపై వివాదం నీడలు ముసురుకున్నాయి.
జై భీమ్ చిత్రంలో వన్నియార్ కులస్తుల గురించి అవమానకర రీతిలో చూపించారని రుద్ర వన్నియార్ సేన అనే కుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... హీరో సూర్యతో పాటు ఆయన భార్య జ్యోతిక, 'జై భీమ్' దర్శకుడు టీజే జ్ఞానవేల్ లపై కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసులను ఆదేశించింది.
వన్నియార్ కుల నేతలు జై భీమ్ సినిమా రిలీజైన సమయంలోనే, ఆ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. తమకు అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని, నష్టపరిహారం కింద రూ.5 కోట్లు చెల్లించాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా వన్నియార్ కుల సంఘం పేర్కొంది. యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కిన జై భీమ్ చిత్రం ఆస్కార్ కు కూడా వెళ్లింది. ఈ సినిమాలో సూర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి.