Telangana: తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సూచన!
- పరీక్షలకు హాజరవుతున్న 9,07,393 మంది విద్యార్థులు
- ఇష్టంగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణతను సాధించాలన్న సబిత
- పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న మంత్రి
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. ఏడాదంతా ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు, ఇష్టంగా పరీక్షలు రాసి, మంచి ఉత్తీర్ణతను సాధించాలని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని సబిత తెలిపారు. మొత్తం 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలను తీసుకున్నామని చెప్పారు. వేసవి దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలను తీసుకున్నామని అన్నారు. కరోనా నేపథ్యంలో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రశ్నల ఛాయిస్ ను కూడా పెంచామని చెప్పారు.
పరీక్ష ప్రారంభం కావడానికి ముందే తమ పిల్లలు ఎగ్జామ్ సెంటర్ కు చేరుకునేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సబిత సూచించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులు ఎవరైనా మానసిక ఒత్తిడికి గురైతే... ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18005999333కి ఫోన్ చేసి సలహాలను పొందవచ్చని తెలిపారు.