Punjab: బీజేపీ నేత తాజిందర్ బగ్గాను ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మంది పంజాబ్ పోలీసులు
- తాజిందర్ బగ్గాపై పలు అభియోగాలు
- ఆప్ నేత సన్నీసింగ్ ఫిర్యాదుతో అరెస్ట్
- కేజ్రీవాల్‌పై విరుచుకుపడిన బీజేపీ
- కశ్మీరీ పండిట్లకు క్షమాపణ చెప్పే వరకు కేజ్రీవాల్‌ను విమర్శిస్తూనే ఉంటానన్న బగ్గా
బీజేపీ నేత తాజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఈ ఉదయం పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి అయిన బగ్గాపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సన్నీ సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రెచ్చగొట్టేలా ప్రసంగించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, మతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం వంటి అభియోగాలు బగ్గాపై నమోదయ్యాయి. అంతేకాదు, మార్చి 30న నిర్వహించిన ఆందోళన సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను బెదిరించారని కూడా సన్నీసింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వీడియో ఆధారాలను పోలీసులకు సమర్పించారు.
బగ్గా అరెస్ట్‌ను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన అరెస్ట్ సిగ్గు చేటని విమర్శించింది. పంజాబ్‌లోని తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకుని తన ప్రత్యర్థులను కేజ్రీవాల్ వేధిస్తున్నారని ఆరోపించింది. ఢిల్లీలోని ప్రతి పౌరుడు తాజిందర్‌కు అండగా నిలుస్తారని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కంపూర్ అన్నారు. తాజిందర్ ఇంటికి వచ్చిన 50 మంది పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని మరో నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. తాజిందర్ నిజమైన నాయకుడని, ఇలాంటి చేష్టలతో ఆయనను బెదిరించలేరని తేల్చి చెప్పారు.
తనను అరెస్ట్ చేసిన వెంటనే బగ్గా ఓ వీడియోను విడుదల చేశారు. కేజ్రీవాల్, పంజాబ్ ప్రభుత్వం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ పండిట్లకు క్షమాపణ చెప్పేవరకు కేజ్రీవాల్‌ను తాను విమర్శిస్తూనే ఉంటానని ఆ వీడియోలో బగ్గా పేర్కొన్నారు.