Umran Malik: 157 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ మాలిక్ మరో కొత్త రికార్డు
- 156 కిలోమీటర్ల గత రికార్డు బ్రేక్
- ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన డెలివరీ ఇదే
- ప్రపంచంలో రెండో వేగవంతమైన బంతిగా రికార్డు
- దాన్ని బౌండరీకి పంపించిన పావెల్
ప్రపంచంలో అత్యంత వేగంగా బంతులు సంధించే బౌలర్లలో ఒకడైన ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడైన అతడు గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరు సందర్భంగా మరింత వేగంతో బంతిని సంధించాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్ సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ డెలివరీ చేసిన బంతి 157 కిలోమీటర్ల వేగాన్ని (గంటకు) తాకింది. ఐపీఎల్ 2022 సీజన్ లో అత్యంత వేగంగా డెలివరీ అయిన బంతి ఇదే. దీనికంటే ముందు ఇదే సీజన్ లో 156 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి రికార్డు నమోదు చేసింది కూడా ఉమ్రాన్ మాలికే. తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. భారత ఐపీఎల్ చరిత్రలో 157 కిలోమీటర్ల వేగంతో బంతి డెలివరీ చేయడం ఇదే తొలిసారి. దీన్ని ఢిల్లీ బ్యాట్స్ మ్యాన్ పావెల్ చక్కని బౌండరీగా మలిచాడు.
ఇక ప్రపంచంలో 157.3 కిలోమీటర్ల వేగంతో ఆస్ట్రేలియా పేసర్ షాన్ టెయిట్ రికార్డు తర్వాత.. రెండో స్థానాన్ని ఉమ్రాన్ మాలిక్ దక్కించుకున్నాడు. బారత్ కే చెందిన జవగళ్ శ్రీనాథ్ 1997లో జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా డెలివరీ చేసిన 157 కిలోమీటర్ల రికార్డు సరసన ఉమ్రాన్ చేరాడు.